IPL 2024 : ఆట మొదలు కాకముందే.. ఫైనల్స్ కు జట్టు ఇవేనంటూ?

ఐపీఎల్ సీజన్ 17 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో విజేత ఎవరన్న దానిపై అనేక విశ్లేషణలు వినపడుతున్నాయి

Update: 2024-03-22 10:33 GMT

ఐపీఎల్ సీజన్ 17 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో విజేత ఎవరన్న దానిపై అనేక విశ్లేషణలు వినపడుతున్నాయి. అన్ని జట్ల పెర్‌ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ ఎవరు ఈసారి విజేత అన్న అంచనాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అనేక మంది మాజీ క్రికెటర్లు సయితం ఈసారి విజేతలపై జోస్యం చెబుతున్నారు. జట్టును చూసి అంచనా వేసి చెబుతుండటమే తప్ప మైదానంలో దిగితే తప్ప చివరికి గెలుపు ఎవరిది అని నిర్ణయించడం కష్టమేనని అందరూ అంగీకరించేదే. కానీ ఎక్కువ మంది మాత్రం ఈ జట్టు ఫైనల్స్ కు చేరుకుని కప్పును ముద్దాడితే బాగుంటుందని ఆ జట్టుకు సంబంధించిన ఫ్యాన్స్ కోరుకోవడంలో తప్పేమీ లేదు.

సెమీ ఫైనల్స్ కు...
సెమీ ఫైనల్స్ కు చేరే జట్లు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు సెమీ ఫైనల్స్ కు చేరుకుంటాయన్న అంచనాలు మాత్రం సోషల్ మీడియలో బాగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ జట్లకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండటమూ ఒక కారణంగా చెప్పాలి. ఇటు చెన్నై సూపర్ కింగ్స్ లో ధోని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో విరాట్ కొహ్లి, ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా ఒక కారణం కాగా, గుజరాత్ టైటాన్స్ 15వ సీజన్ విజేతగా నిలవడంతో అది కూడా సెమీ ఫైనల్స్ కు చేరుకునే ఛాన్స్ ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
వాళ్లే రావాలని...
అదే సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఒకింత ముందంజలో ఉంది. ఆ జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తుండటమే ఇందుకు కారణం. అయితే ఎక్కువ మంది మాత్రం ఫైనల్స్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడాలని కోరుకుంటున్నారు. ఆ జట్లు ఫైనల్స్ కు వస్తాయంటూ ఎక్కువ మంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఐదుసార్లు కప్ ను సొంతం చేసుకోగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సెమీ ఫైనల్స్, ఫైనల్స్ వరకూ వచ్చి కప్పును చేజార్చుకుంది. ఈసారి మాత్రం కప్పు కొహ్లి ఉన్న బెంగళూరు జట్టుదేనంటూ ఎక్కువ మంది ఫ్యాన్స్ పోస్టింగ్‌లు పెడుతున్నారు.
ఇద్దరికీ ఫ్యాన్స్ ఎక్కువే...
క్రికెట్‌లో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్న వారిద్దరే ఇద్దరు. ఒకరు మహేంద్ర సింగ్ ధోని. ధోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి కేవలం ఐపీఎల్‌లోనే కనిపిస్తాడు. ధోనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కోట్లలో ఉన్నారు. మిస్టర్ కూల్ ఉన్న జట్టు గెలవాలని సహజంగా వారు కోరుకుంటారు. అదే సమయంలో విరాట్ కు కూడా ఫ్యాన్స్ కు తక్కువేమీ కాదు. పరుగుల యంత్రంగా, కింగ్ కొహ్లిగా అభిమానులు పిలుచుకుంటూ విరాట్ ఉన్న జట్టు కప్పును సొంతం చేసుకోవాలని భావిస్తారు. ఇప్పుడు అదే చర్చ సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంది. కానీ ఇది ఐపీఎల్. ఏ జట్టు గెలుస్తుందో? ఏ జట్టు కప్పు గెలుచుకుంటుందో ముందుగా అంచనాలు వేయలేని పరిస్థితి. కానీ ఐపీఎల్‌కు ముందు ఇలాంటి అంచనాలు వినపడటం కామన్.


Tags:    

Similar News