IPL 2024 : టిక్.. టిక్.. టిక్.. గంటలే సమయం.. ధనాధన్ మ్యాచ్‌లు షురూ
ఐపీఎల్ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. మొత్తం పదకొండు జట్లు ఈ ఐపీఎల్ సీజన్ లో పాల్గొననున్నాయి.
ఐపీఎల్ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. మొత్తం పదకొండు జట్లు ఈ ఐపీఎల్ సీజన్ లో పాల్గొననున్నాయి. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లతో జట్లన్నీ నిండిపోయాయి. ఈనెల 22వ తేదీన ఐపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. ఆరంభ మ్యాచ్ అదిరిపోయేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. ఫైనల్స్ ఎవరు చేరతారన్నది పక్కన పెడితే తొలి మ్యాచ్ లో ఇటు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లో ఆటగాడిగా విరాట్ కొహ్లి మైదానంలో కనిపించనున్నారు. అది చాలు.. ఫ్యాన్స్ కు ఫీస్ట్. అందుకే తొలిరోజే టీవీలకు అభిమానులు అతుక్కుపోతారు.
తొలి రోజు ఆటను...
తొలి రోజు ఆట మజాను అనుభవిస్తే ఐపీఎల్ సీజన్ 17 సక్సెస్ అయినట్లే. ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ ను చూసే వారంతా ఆరంభ మ్యాచ్ మాత్రం ఉత్కంఠ భరితంగా సాగితే మాత్రం ఐపీఎల్ సీజన్ కు ఇక తిరుగుండదని నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఐపీఎల్ అంటేనే టెన్షన్.. చివరి బంతి వరకూ విజయం ఎవరిదో చెప్పలేం. సూపర్ ఓవర్లతో పాటు.. సూపర్ క్యాచ్‌లు.. అద్భుతమైన షాట్లు.. బుల్లెట్లలా దూసుకొచ్చే బంతులు ఇలా ఒక్కటి కాదు.. కన్నార్పకుండా చూసేవారికి ఐపీఎల్ కంటే మరొక వేదిక ఉండదు. ఒక్కోసారి అసలు ఫామ్ లో లేని టీంలు కూడా దూసుకు వచ్చి చివరి బంతితో విక్టరీని కొట్టేస్తాయి. అందుకే ఐపీఎల్‌కు ఇండియాలోనే కాదు అంతర్జాతీయంగా అంతటి ఆదరణ లభించింది.
పదహారు సీజన్లు...
ఇప్పటి వరకూ పదహారు సీజన్లు సక్సెస్ ఫుల్ గా నడిచాయంటే.. దాని క్రేజ్ మరో ఆటకు లేదనే చెప్పాలి. చివరకు కరోనా సమయంలోనూ ఐపీఎల్ ను వేరే దేశంలో నిర్వహించి అభిమానులను ఉత్తేజపర్చారు. ఇలా ఐపీఎల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ నిర్వాహకులు ఏడాదికి ఏడాది సరికొత్త రూల్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాత్రి ఏడు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ పదిన్నర పది గంటల వరకూ సాగుతుంది. అందులోనూ వేసవికాలం కావడంతో వర్షం ముప్పు కూడా పెద్దగా ఉండే అవకాశం లేదు. అందుకే మార్చి నెలలోనే ఐపీఎల్ ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మరొకవైపు టీం ఇండియాలోని అందరినీ టీవీలో చూసే వీలుంది.
రికార్డుల మోత...
దీంతో పాటు కొత్త కుర్రాళ్లు ఐపీఎల్ లోకి వచ్చి తారాజువ్వల్లా ఎదుగుతున్నారు. అందుకే కొత్తకొత్త ముఖాలతో వచ్చి క్రికెట్ లో పాతుకుపోయేందుకు పునాదులు నిర్మించుకుంటారు. ఆడినోడికి అవకాశాలు.. ఫెయిల్ అయిలేనోడికి మాత్రం క్యాప్ దొరకదు. అందుకే ఐపీఎల్ ను అంతర్జాతీయంగా అన్ని దేశాలు కూడా ఆటగాళ్ల ఆటతీరును పరిశీలిస్తాయి. తమ జట్టులో అవకాశం ఇచ్చేందుకు దీనిని ఒక మెట్టుగా భావిస్తాయి. అలాగే ఐపీఎల్‌లోనే రికార్డు లు బ్రేక్ అవుతాయి. రికార్డుల కోసం ఇటు సీనియర్లు, అటు జూనియర్లు పోటీ పడుతుండటం చూసి తీరాల్సిందే. చెప్పుకుంటే చాలా తక్కువ. చూడటంతోనే తనివి తీరేలా మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే ఐపీఎల్ ఈ సీజన్ కూడా అభిమానులను అలరిస్తుందని ఆశిద్దాం.