IPL 2024 : రాయల్స్ పట్టు జారిపోతుందా? ఎందుకు ఫామ్ లేక అవస్థలు పడుతుందా?

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లోనూ రాజస్థాన్ రాయల్స్ దారుణ ఓటమి పాలయింది

Update: 2024-05-16 04:17 GMT

సముద్రాన్ని ఈది వచ్చి ఇంటి ముందు మురికి కాల్వలో పడినట్లుంది రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి. ఈసారి ఐపీఎల్ సీజన్ లో ఎక్కువ విజయాలను సాధించింది రాజస్థాన్ రాయల్స్. సీజన్ ప్రారంభం నుంచి అన్ని జట్లను ఓడిస్తూ వస్తుంది. పదమూడు మ్యాచ్ లు ఆడితే ఎనిమిది మ్యాచ్ లలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో మొన్నటి వరకూ అగ్ర స్థానంలో ఉండేది. తర్వాత రాను రాను జట్టులో కొంత తేడా కనిపిస్తున్నట్లుంది. పట్టు జారినట్లు కనిపిస్తుంది. వరస ఓటములతో రాజస్థాన్ రాయల్స్ కొంత నిరాశలో ఉంది. ప్లే ఆఫ్ రేసు బెర్త్ దాదాపు ఖరారరయినప్పటికీ ఈ సమయంలో జట్టు ఫామ్ లో లేకపోవడం కొంత ఇబ్బంది కలిగించే అంశమే.

ఆదిలో అదరగొట్టి...
రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి నుంచి మంచి విజయాలను సాధించింది. దాదాపు అన్ని జట్లను ఓడించింది. అంటే ఫుల్ ఫామ్ లో ఉన్నట్లే కనిపించింది. ఇదే ఊపు కొనసాగితే ఇక ఫైనల్స్ కు చేరి ఛాంపియన్ గా మారుతుందన్న అంచనాలు కూడా వినిపించాయి. అలా సాగిన జట్టు ప్రయాణం ప్లే ఆఫ్ కు చేరుకున్న దశలో కొంత వెనకబడుతుంది. అంటే పాయింట్ల పట్టికలో వెనకబడిలేదు కానీ... ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తుంది. వరసగా నాలుగు ఓటములను చవి చూడటంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు అసలు ఈసారి ఫైనల్స్ కు చేరుతుందా? అన్న అనుమానాలు ఆ జట్టు ఫ్యాన్స్ లో ఆందోళనలోకి నెట్టేశాయని చెప్పాలి.
వరస ఓటములతో...
నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లోనూ రాజస్థాన్ రాయల్స్ దారుణ ఓటమి పాలయింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పూర్తిగా విఫలమయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 144 పరుగులు మాత్రమే చేసింది. పరాగ్ తప్ప ఎవరూ ఈ జట్టులో రాణించలేదు. తక్కువ స్కోరును ఇచ్చి పంజాబ్ కు విజయాన్ని దగ్గరకు చేర్చింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు ఆదిలో కొంత తడబాబు కనిపించినా చివరకు 18.5 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. సామ్ కరన్ 63 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. మొత్తం మీద రాజస్థాన్ రాయల్స్ జట్టు చిట్టచివరకు వచ్చేసరికి చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. దీన్ని ఎవరు కాపాడాలి?


Tags:    

Similar News