IPL 2024 : రాజస్థాన్ రెండో విజయం... పరాగ్ వల్లనే సాధ్యమయిందిగా..?
రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ లో రియాన్ పరాగ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు
ఐపీఎల్ లో అంతే.. ఎవరో ఒకరు క్లిక్ అయినా చాలు మ్యాచ్ మన చేతికి వచ్చినట్లే. అయితే ఆ ఆటగాడు ఎవరు అనేది మైదానంలోకి దిగేంత వరకూ తెలియదు. ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు కూడా తీరా మ్యాచ్ సమయానికి పనికిరాకుండా పోతారు. అలాగే పరవాలేదు అనిపించిన ప్లేయర్ దుమ్మురేపి జట్టు విజయంలో కీలక భూమిక పోషిస్తారు. క్రికెట్ లోనూ.. ఐపీఎల్ లోనూ అదే జరుగుతుంది. అందుకే ఎవరు ఎప్పుడు రైజ్ అవుతారో చెప్పలేం. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ లోనూ అదే జరిగింది.
పరాగ్ ఒంటరి పోరాటం...
ఊహించని ఆటగాడు చెలరేగి ఆడటంతో రాజస్థాన్ రాయల్స్ అత్యధిక స్కోరు సాధించగలిగింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు వరసగా వికెట్లో కోల్పోయినా రియాన్ పరాగ్ ఒంటరి పోరాటం చేశాడు. 45 బంతుల్లో 84 పరుగులు చేశాడు. మిగిలిన ఐదుగురు ఆటగాళ్లు వంద పరుగులకు మించి చేయలేకపోయారు. అందుకే రాజస్థాన్ రాయల్స్ 185 పరుగుల సాధించగలిగింది. పన్నెండు పరుగుల తేడాతో ఢిల్లీ కేపిటల్ప్ పై విజయం సాధించి ఈ ఐపీఎల్ లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
ఓవర్లు లేక...
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో పరాగ్ చెలరేగి ఆడటంతోనే ఆ జట్టుకు విజయం లభించింది. ఇరవై ఓవర్లలో 185 పరుగుల చేసిన ఆ జట్టును ఓడించే లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేపిటల్స్ ఆదిలో బాగానే ఆడింది. డేవిడ్ వార్నర్ 49 పరుగులు చేశాడు. స్టబ్స్ 44 పరుగులు చేశాడు. అయితే మిగిలిన ఆటగాళ్లు రాణించలేకపోయారు. చేతిలో వికెట్లున్నాయి. కానీ ఓవర్లు లేవు. చివరి ఓవర్ లో పదిహేడు పరుగులు చేయాల్సి ఉండగా కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది. డెత్ ఓవర్ లో అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ కేపిటల్స్ ఈ ఐపీఎల్ లో వరసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.