IPL 2024 : ముంబయి కూడా అంతకు మించి ఆడినట్లే.. కానీ సహకారం కొరవడి?
నిన్న ముంబయి ఇండియన్స్ మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా ఛేజింగ్ లోనూ సత్తా చాటిందని అనిపించక మానదు
నిన్న ముంబయి ఇండియన్స్ సన్ రైజర్స్ మ్యాచ్ చూస్తే ఇంత స్కోరు ఏ జట్టయినా చేయగలదా? అని అనిపిస్తుంది. కానీ ముంబయి ఇండియన్స్ కూడా ే మాత్రం తగ్గలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు 277 పరుగులు చేసింది. దీంతో అసలు ముంబయి ఇండియన్స్ జట్టు ఆ స్కోరు చూసి ముందడుగు వేస్తుందా? అని అనిపించింది. ఎందుకంటే ఐపీఎల్ లో అత్యంత భారీ స్కోరు కావడంతో ముంబయి బ్యాటర్లు ఇక ఓటమికి రెడీ అయిపోతారని అందరూ భావించారు. అందుకే ఆజట్టు అభిమానుల్లో ఎవరికీ పెద్దగా ఆశల్లేవు. ఏదో మ్యాచ్ చూడాలని కూర్చున్నారు తప్పించి గెలిచేస్తామని మాత్రం ఎవరూ అనుకోలేదు.
గెలవలేదు కానీ...
అలాగే గెలవలేదు కానీ.. గెలిచినంత పనిచేసింది ముంబయి ఇండియన్స్ జట్టు. అంత పెద్ద స్కోరు అయినా కేవలం 31 పరుగుల తేడాతోనే ఓటమి పాలయింది. ఒకదశలో ముంబయి జట్టు గెలుస్తుందేమోనని అనిపించింది. కానీ తృటిలో గెలుపు గేటు తెరుచుకోవడం తప్పి పోయింది కానీ లేకుంటే గెలిచేదేమో. ముఖ్యంగా తెలుగు కుర్రోడు తిలక్ వర్మ చెలరేగి ఆడాడు. 34 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 42 పరుగులు, ఇషాన్ కిషన్ 34, రోహిత్ శర్మ 26 పరుగులు చేశారు.
లక్ష్యం పెద్దది కావడంతో...
అయితే బంతులు ఎక్కువగా లేకపోవడం లక్ష్యం పెద్దది కావడంతో ముంబయికి ఓటమి తప్పలేదు. కెప్టెన్ కమిన్స్, ఉనద్కత్ జయదేవ్ తలో రెండు వికెట్లు తీసి ముంబయి పతనాన్ని శాసించారు. ఈ సీజన్ లో ముంబయి ఇండియన్స్ కు రెండు జట్లతో తలపడి ఓటమి పాలుకాగా, సన్ రైజర్స్ మాత్రం రెండింటిలో తలపడి ఒక జట్టుపై గెలిచి రేసులో తానున్నానని నిరూపించుకుంది. రెండు జట్లు కెప్టెన్సీలు మార్చాయి. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లలో ఫలితాలు ఇలా ఉండటంపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ మార్చాలంటూ సోషల్ మీడియాలో ఆ జట్టు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.