Devendra Fadnavis : ఫడ్నవిస్ కమలానికి దొరికిన అరుదైన నాయకుడా?

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుత కూటమి అద్భుతమైన విజయం సాధించడానికి దేవేంద్ర ఫడ్నవిస్ అనుసరించిన వ్యూహాలే కారణమంటారు

Update: 2024-11-23 12:15 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుత కూటమి అద్భుతమైన విజయం సాధించడానికి దేవేంద్ర ఫడ్నవిస్ అనుసరించిన వ్యూహాలే కారణమంటారు. ఆయన తొలి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. మహారాష్ట్రలో సీనియర్ నేతలను కాదని బీజేపీ ఒక యువకుడు అయిన దేవేంద్ర ఫడ్నవిస్ కు గతంలో ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. దేవంద్ర ఫడ్నవిస్ చాలా చిన్న వయసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 44 ఏళ్ల వయస్సులోనే ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత 2018 లో జరిగిన ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమికి అద్భుతమైన విజయాన్ని అందించగలిగారు. అయితే శివసేన కాంగ్రెస్ కూటమి పంచన చేరడంతో అధికారం చేజారిపోయింది.

గత ఎన్నికల్లోనూ...
2018 ఎన్నికల్లోనూ బీజేపీ, శివసేన కలసి పోటీ చేశాయి. ప్రజలు అత్యధిక స్థానాలను కట్టబెట్టినా ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే పట్టుబట్టారు. కానీ బీజేపీ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో కాంగ్రెస్ కూటమితో కలసి ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి కాగలిగారు. అనంతరం ఫడ్నవిస్ ప్రధానంగా పార్టీని నడిపిస్తూ నాయకత్వంపై సభ్యుల్లో నమ్మకం ఏర్పరచగలిగారు. అనంతరం శివసేన నుంచి ఏక్ నాధ్ షిండే వర్గం చీలి బయటకు రావడంతో దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి పదవిని ఆశించినా బీజేపీ కేంద్ర నాయకత్వం సానుకూలంగా స్పందించలేదు. దీంతో ఏక్ నాధ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి లభించింది. అయినా ఫడ్నవిస్ పార్టీని 2024 ఎన్నికలకు సిద్ధం చేయడంలో సక్సెస్ అయ్యారన్నది పార్టీ వర్గాల బలంగా చెబుతున్న విషయం. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కావాలంటూ అత్యధిక శాతం మంది బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు కోరుకున్నారు.
గతంలోనే సీఎంగా...
గతంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ఎంపిక చేయడాన్ని అందరికీ ఆశ్చర్యం కల్గించింది. బీజేపీ తప్పు చేసిందని అందరూ భావించారు. యువకుడు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఫడ్నవిస్ ను ఎంపిక చేయడాన్ని పార్టీలోని కొందరు నేతలూ తప్పుపట్టారు. ఎందుకంటే మహారాష్ట్రలో మరాఠాలదే రాజకీయంగా ఆధిపత్యం. వారిని కాదని వేరే సామాజిక వర్గానికి చెందిన నేతను ఎంపిక చేయడమేమిటన్న ప్రశ్న కూడా తలెత్తింది. అయితే ఫడ్నవిస్ తానేంటో నిరూపించుకున్నారు. ఫడ్నవిస్ తన పాలనలో అవినీతి కి చోటు లేకుండా చాలా ప్రయత్నమే చేశారంటున్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అవినీతిపై ఆయన సమరశంఖమే పూరించారని చెప్పొచ్చు. అవినీతి మయంగా మారిన ముంబయి కార్పొరేషన్ లో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. దీంతో ఫడ్నవిస్ పాలనపై ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఎంత కఠినంగా ఉన్నారంటే తన మంత్రివర్గంలో ఎవరు అవినీతికి పాల్పడినా కేవలం హెచ్చరికలతో వదిలిపెట్టలేదు. అవినీతి ఆరోపణలు వచ్చిన సీనియర్ మినిస్టర్ ఏక్ నాథ్ ఖడ్సేను నిర్మొహమాటంగా మంత్రివర్గం నుంచి తొలగించి తానేంటో అందరికీ చెప్పేశారు. దీంతో అధికారుల్లోనూ అవినీతికి పాల్పడాలంటే భయపడే స్థితికి తెచ్చారంటారు.
ఇప్పుడు కూడా...
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ యువనేతగా ఆవిర్భవించి కమలం పార్టీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడ్డారంటారు. అందుకు అనేక కారణాలున్నాయి. అందరినీ కలుపుకుని పోతూ, నవ్వుతూ పలకరిస్తూ ఉండే దేవేంద్ర ఫడ్నవిస్ సొంత పార్టీ నేతల నుంచి ఎలాంటి అసంతృప్తిని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ రప్పించుకోలేదు. అలాగే పార్టీ నేతలు కూడా దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వాన్నే కోరుకోవడం ఆయన కలుపుకోలు తనానికి నిదర్శనమని చెప్పాలి. అయితే ఇప్పుడు కూడా చివరి నిమిషం వరకూ దేవేంద్ర ఫడ్నవిస్ ను ముఖ్యమంత్రి చేస్తారని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. మోదీ, అమిత్ షాలు ఎవరు అనుకుంటే వారు సీఎం అవుతారు. అయితే ఫడ్నవిస్ ను కావాలని ఎంత మంది ఎమ్మెల్యేలు కోరుకున్నా ఫలితం ఉండదు. కానీ ఈ విజయంలో మాత్రం ఫడ్నవిస్ భాగస్వామ్యాన్ని ఎవరూ కాదనలేరు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ బలంగా ఉన్న మహారాష్ట్రలో బీజేపీని బలోపేతం చేయడం వెనక ఫడ్నవిస్ పాత్రను ఎవరూ తోసిపుచ్చలేరన్నది వాస్తవం.


Tags:    

Similar News