Turmeric : పసుపు రైతులకు నిరాశ.. ఒక్కసారిగా పరిపోయిన ధర
పసుపు ధర బాగా పడిపోయింది. దీంతో పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు;

పసుపు ధర బాగా పడిపోయింది. దీంతో పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసినా గత ఏడాది ధరలు కూడా పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక క్వింటాలు ధర రూ.17 వేల రూపాయల నుండి 18 వేల రూపాయలు వచ్చేదని, ఇప్పుడు కేవలం ఏడు వేలు రూపాయలు మాత్రమే వస్తుందని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాల్లో పసుపు పంట సాగవ్వటంతోనే ఈ ఏడాది పసుపుకు ధర రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
పసుపు బోర్డు వచ్చినా...
పసుపు బోర్డు వచ్చాక మంచి లాభాలు ఉంటాయని అదనంగా 10 వేల ఎకరాల్లో రైతులు పసుపు సాగు చేశారు. జగిత్యాల జిల్లాలో పసుపు సాగు ఎక్కువగా ఉండగా, పంటను అమ్ముకునేందుకు మెట్ పల్లి, జగిత్యాల, నిజామాబాద్ మార్కెట్లకు రైతులు పసుపును తరలించారు. పసుపు నిల్వ చేసే మార్గం లేకపోవడంతో నష్టం వచ్చినా కూడా ప్రైవేటు సంస్థలకు రైతులు అయిన కాడికి విక్రయిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా సరిగ్గా రావట్లేదని, పసుపు బోర్డు ఇప్పటికైనా రంగంలోకి దిగి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఆందోళనకు దిగిన రైతులు...
అయితే పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్లనే తాము అధిక విస్తీర్ణంలో పంట వేశామంటున్నారు రైతులు. కనీసం పెట్టుబడి కూడా రాకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక నిజామాబాద్ లో పసుపు బోర్డు పెట్టి ఏం ప్రయోజనమని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా ప్రభుత్వాలు తమతో ఆడుకుంటున్నాయని పసుపు బోర్డు వద్ద ఆందోళనకు దిగుతున్నారు. ఇలా అనేక ప్రాంతాల నుంచి నిజామాబాద్ కు వచ్చిన పసుపు రైతులు ఇక రోడ్డెక్కే అవకాశాలుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.