Ap Budget : ఈ బడ్జెట్ స్పెషల్ ఏంటంటే?
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసారి సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉంది
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసారి సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉంది. అధికార వైసీపీలో లుకలుకలు బయలుదేరాయి. అది అసంతృప్తి అనాలో.. అసహనం అనాలో.. లేక ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని కావచ్చు. ఏదిఏమైనా ఈ బడ్జెట్ సమావేశాల్లో అధికార అసంతృప్తి ఎమ్మెల్యేలు బయటపడుతుండటం విశేషం. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండటంతో ఈ బడ్జెట్ సమావేశాలు జగన్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా మారాయి. అది కూడా ఒక జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే అసంతృప్తి ఎమ్మెల్యేలుగా అవతారమెత్తారు. ఇది జగన్ ప్రభుత్వానికి ఈ బడ్జెట్ సమావేశాల్లో కొంత ఇబ్బందిగానే చెప్పుకోవాలి.
సహజమే అయినా...
సాధారణంగా ఎన్నికలకు ముందు పార్టీలు మారడం సహజం. అయితే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు పార్టీలపైన, ప్రభుత్వంపైన అసంతృప్తి వెళ్లగక్కి పార్టీని వీడి వెళ్లాలనుకోవడం మాత్రం కొంత అధినాయకత్వానికి తలనొప్పిగా మారిందనే అందరూ ఒప్పుకోవాల్సి ఉంటుంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు పార్టీపైన బహిరంగంగానే ధ్వజమెత్తారు. దీంతో వైసీపీ అధినాయకత్వం వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో సమన్వయకర్తలను నియమించారు. అప్పటి నుంచి వారిద్దరూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేగా...
తాజాగా ఈరోజు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విన్నూత్న తరహాలో శాసనసభలో నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని తనకు మైకు ఇవ్వాలని, నియోజకవర్గంలో తన సమస్యలను పరిష‌్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి ఇటువంటి డిమాండ్ రావడంతో అధికార పార్టీకి కొంత చికాకు కలిగించిందనే చెప్పాలి. మంత్రులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ముప్పేట దాడి చేసినప్పటికీ ఆయన తన ఆందోళనను విరమించలేదు. సస్పెండ్ చేస్తే అధికార పార్టీ సభ్యుడిపై చర్య తీసుకున్నట్లవుతుంది. అలాగే వదిలేస్తే కోటంరెడ్డి తలనొప్పిగా తయారవుతారు. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాల్లో కోటంరెడ్డి ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సమస్యగా మారనున్నారని చెప్పాలి.
ఎమ్మెల్సీ ఎన్నికలలో...
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటా కింద జరగనున్న ఈ ఎన్నికల్లో టీడీపీ కూడా తన అభ్యర్థిగా పంచుమర్తి అనూరాధను బరిలోకి దింపింది. గతంలో ఎమ్మెల్యే కోటా కింద ఏకగ్రీవమయ్యే ఎన్నికలు ఈసారి ఎన్నికలు జరుగుతుండటం ఇప్పటి ప్రత్యేకతగానే చెప్పుకోవచ్చు. టీడీపీ విప్ జారీ చేయనుంది. టీడీపీ నుంచి ఎన్నికై వైసీపీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్న నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి అనుకూలంగా ఓటేస్తారనే అధికార పార్టీ భావిస్తుంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు ఎటువైపు వేస్తారో తెలియదు. రహస్య ఓటింగ్ కాబట్టి చెప్పలేని పరిస్థిితి. ఆత్మప్రభోదానుసారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఓటు వేస్తానని కోటంరెడ్డి బహిరంగంగానే చెప్పడంతో వైసీపీకి కొంత ఇబ్బందిగానే మారింది. మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని ప్రత్యేకతను ఈ బడ్జెట్ సమావేశాలు సంతరించుకున్నాయనే చెప్పాలి.