వాళ్లిద్దరి అరెస్ట్ ఖాయం : రోజా
లోకేష్, అచ్చెన్నాయుడు కూడా త్వరలో అరెస్ట్ అవుతారని మంత్రి ఆర్కే రోజా అన్నారు
లోకేష్, అచ్చెన్నాయుడు కూడా త్వరలో అరెస్ట్ అవుతారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేసే ఆలోచనలు ముఖ్యమంత్రి జగన్ చెయ్యరని అన్నారు. అటువంటి చీప్ పాలిటిక్స్ జగన్ చేయరని ఆమె అన్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో ఆధారాలు ఉండబట్టే అరెస్ట్ చేశారని తెలిపారు. ఇన్నాళ్లూ జగన్ విమర్శించిన నోళ్లు ఇప్పుడు ఏం వాగుతాయని ప్రశ్నించారు. జగన్ ను వ్యక్తిగతంగా దూషిస్తూ సైకో జగన్ అంటూ దుర్భాషలాడుతూ టీడీపీ నేతలు పైశాచికత్వానికి పాల్పడుతున్నారన్నారు.
బ్రాండ్ అంబాసిడర్ గా...
బోగస్ కంపెనీలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని రోజా పేర్కొన్నారు. తాను స్కిల్ డెవలెప్‌మెంట్ స్కీంలో అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు రాతపూర్వకంగా ఇవ్వాలని రోజా డిమాండ్ చేశారు. ఇదొక్క కేసు మాత్రమే కాదని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, పోలవరం నుంచి పట్టిసీమ వరకూ అంచనాలు పెంచి ఎంత దోచుకున్నారని రోజా ప్రశ్నించారు. గతంలో సోనియా గాంధీతో కుమ్మక్కై జగన్ పై కేసులు పెట్టడాన్ని అక్రమ కేసులంటారని, దీనిని కక్ష సాధింపు చర్యలని అనరని కూడా రోజా అన్నారు. ముద్రగడ పద్మనాభం కుటుంబం అక్రమ నిర్భంధాన్ని కక్ష సాధింపు చర్య అని అంటారని రోజా ఫైర్ అయ్యారు.
పవన్ పై ఫైర్...
తనను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు బహిష్కరించడం కక్ష సాధింపు చర్య అని ఆమె అన్నారు. పథ్నాలుగేళ్లు అవినీతి అనకొండను తాము ముఖ్యమంత్రిని చేశామా? అని జనం బాధపడుతున్నారు. పవన్ కల్యాణ్ పై కూడా రోజా నిప్పులు చెరిగారు. జనసేన పార్టీ పెట్టి చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. కేవలం ప్యాకేజీ కోసమే చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారన్నారు. పవన్ కల్యాణ్ మాటలను ఎవరూ పట్టించుకోరని రోజా అన్నారు. చంద్రబాబు కోసం పరుగెత్తుకుంటూ వస్తే శాంతిభద్రతలు దృష్ట్యా వెనక్కు పంపితే ఏపీకి రావాలంటే పాస్ పోర్టు కావాలంటావా? అని రోజా ప్రశ్నించారు. పవన్ దిగజారి పోయి జగన్ పై అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.