యువగళాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నా : లోకేష్
యువగళాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.
యువగళాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మళ్లీ యువగళం ఎప్పుడు ప్రారంభమయ్యేది చెబుతామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ కు ప్రజలు సంపూర్ణంగా, స్వచ్ఛందంగా మద్దతు తెలిపారని లోకేష్ అన్నారు. రాజమండ్రిలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. షెల్ కంపెనీలకు నిధులను మళ్లించారని సీఐడీ అధికారులు నిరూపించలేకపోయారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.
రాజమండ్రిలోనే ఉన్నా...
దొంగ కేసులు పెట్టి జైలుకు తరలించారని లోకేష్ అన్నారు. జగన్ కు ఉన్న బురదను అందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నిసార్లు జైలుకు పంపుతారో పంపుకోండి అని అన్నారు. తాము కేసులకు భయపడే ప్రసక్తి లేదని లోకేష్ తెలిపారు. తనను కూడా అరెస్ట్ చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారని, తాను రాజమండ్రిలోనే ఉన్నానని, దమ్ముంటే తనను కూడా అరెస్ట్ చేసుకోవాలని లోకేష్ సవాల్ విసిరారు. తమ పోరాటం ఆగదని, మిమ్మల్ని వదిలపెట్టనని కూడా లోకేష్ అన్నారు.
దొంగ కేసులు పెట్టి...
తమ కుటుంబం ప్రతి ఏడాది ఆస్తులు ప్రకటిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు.చంద్రబాబు అరెస్ట్ ను ప్రజలంతా ఖండించారన్నారు. తమకు మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు, సీపీఐ, సీపీఎంలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుపై అవినీతి మరక వేయడానికి సైకో జగన్ ప్రయత్నిస్తున్నాడని, అయితే జనం ఈ ఆరోపణలను నమ్మరని కూడా లోకేష్ అన్నారు. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని, వాటిని అధిగమించి ముందుకు వెళతామని తెలిపారు. చంద్రబాబును జైలుకు పంపినంత మాత్రాన తమ పోరాటం ఆగదని ఆయన అన్నారు.