రైతులకు భరోసా.. మరో అవకాశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో స్పీడ్ పెంచింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో స్పీడ్ పెంచింది. పథకాలను అమలు చేయడమే కాదు అర్హులైన వారందరికీ అందాలన్నది ముఖ్యమంత్రి జగన్ ఆలోచన. పార్టీ, కులాలు, మతాలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందాలని జగన్ ఆదేశాలు ఇప్పటికే ఇచ్చారు. ఈ మేరకే అనేక పథకాలకు సంబంధించి గడువు పూర్తయినా మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ వస్తున్నారు. వివిధ కారణాలతో లబ్ది పొందని వారికి పథకాలను అమలు చేస్తున్నారు.
దరఖాస్తుల స్వీకరణకు...
అందులో భాగంగానే తాజాగా ఏపీ ప్రభుత్వం రైతు భరోసా విషయంలోనూ మరో మారు ఈ నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకానికి అర్హులైన వారి నుంచి మరోసారి దరఖాస్తులను స్వీకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ రైతు భరోసా పథకాన్ని పొందని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది. రైతు భరోసా కింద ప్రతి ఏడాది వివిధ దశల్లో రైతులకు 13,500 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది.
కొత్త వారికే...
ఈ దరఖాస్తులను వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అలాగే విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్‌ల నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అయితే ఇప్పటికే ఈ పథకాన్ని పొందుతున్న వారు మాత్రం దరఖాస్తు చేసుకోవద్దని, పథకం అందని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. మూడు విడతల్లో పదమూడు వేల ఐదు వందలు ఇస్తుండటంతో దరఖాస్తులు మరిన్ని అందే అవకాశాలున్నాయి. అర్హులైన వారందరికీ ఈ పథకం కింద నగదును జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.