1518లోని కృష్ణదేవరాయ శాసనం కుంగిపోతోంది: రక్షణకు పిలుపు
దుర్గిలోని శ్రీకృష్ణదేవరాయ శాసనం కుంగిపోతుండగా, డా. ఈమని శివనాగిరెడ్డి రక్షణ చర్యలకు పిలుపునిచ్చారు.
విజయవాడ/అమరావతి: పల్నాడు జిల్లాలో మండల కేంద్రమైన దుర్గి పట్టణంలో రోజురోజుకూ కుంగిపోతున్న శ్రీకృష్ణదేవరాయలి శాసనాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. స్థానిక శిల్పి, చెన్నుపాటి శ్రీనివాసాచారి ఇచ్చిన సమాచారం మేరకు
శుక్రవారం నాడు ఆయన దుర్గిలోని వంకేశ్వరాలయంలోని క్రీ.శ.1518, నవంబర్ 22వ తేదీ, సోమవారం నాటి విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలి కుంగిపోయిన శాసన స్థంభాన్ని పరిశీలించారు. ఆ శాసనంలో, శ్రీకృష్ణదేవరాయని ద్వారపాలకుడైన తిమ్మపనాయనింగారు, నాగార్జునకొండసీమలోని దుర్గిపొలంలో ఉన్న గుండాల గ్రామాన్ని స్థానిక వీరేశ్వర, వంకేశ్వర దేవరల అంగరంగ వైభవాలకు, అమృతపళ్లకు, దానం చేసిన వివరాలతో పాటు తుఱక (ముస్లిం)ల ప్రస్తావన ఉండటం ఈ శాసన ప్రత్యేకత అని శివనాగిరెడ్డి చెప్పారు.
55 పంక్తులు గల శాసనంలో 19 పంక్తులే కనిపిస్తున్నాయనీ, 36 పంక్తుల శాసన భాగం, భూమిలో కూరుకు పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చారిత్రక ప్రాధాన్యతగల ఈ శాసనాన్ని పైకి తీసి, ఒక పీఠంపై నిలబెట్టి, శాసన వివరాలను ఇప్పటి తెలుగు భాషలో రాసిన బోర్డును ఏర్పాటు చేసి, భావితరాలకు అందించి, ఈ శాసనాన్ని కాపాడుకోవాలని, దుర్గి పట్టణ వాసులకు, ఆలయ అర్చకులు, అధికారులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.