నేడు కస్టడీ పిటీషన్‌పై... బెయిల్ కూడా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కస్డడీ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కస్డడీ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల కస్టడీకి చంద్రబాబును సీఐడీకి అప్పగించింది. కానీ సీఐడీ అధికారులకు చంద్రబాబు సహకరించడం లేదని చెబుతూ మరోసారి కస్టడీకి అనుమతివ్వాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది.
మరో ఐదు రోజులు...
దీనిపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. తమకు మరో ఐదు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ తరుపున న్యాయవాదులు కస్టడీ పిటీషన్ వేశారు. దీంతో పాటు చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై కూడా నేడు వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు రాజమండ్రి జైలుకెళ్లి ఇరవై ఐదు రోజులు దాటి పోవడంతో బెయిల్ ఇవ్వాలని ఆయన తరుపున న్యాయవాదులు కోరుతున్నారు. నిన్న సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ వాయిదా పడిన నేపథ్యంలో నేడు కస్టడీ, బెయిల్ పిటీషన్ పై ఎలాంటి తీర్పులు వెలువడనున్నాయన్నది ఉత్కంఠగా మారింది.