Chandrababu : రైతుల ఖాతాల్లో నగదు ఎప్పుడు వేయాలంటే? డేట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వెళుతుంది;

Update: 2025-01-03 06:10 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వెళుతుంది. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పది వేల రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ కింద రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించడంతో చంద్రబాబు కూడా ఒకేసారి ఆ డబ్బుతో కలిపి మరో పదివేలు జత చేసి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం పది వేలు ఇవ్వాలని నిర్ణయించడంతో దానితో కలిపి మరో పదివేలు అదనంగా చేర్చి ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని డిసైడ్ చేశారు.

మరో పదివేలు కలిపి...
దీనికి అన్నదాత సుఖీభవ పథకం అని ఎన్నికలకు ముందే నామకరణం చేశారు. అయితే చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఇరవై వేలు ఇస్తామని చెప్పారని, కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి ఇస్తే ఎలా? అని విపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు కూడా ధీటుగా సమాధానం చెప్పాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం అంటే కలసి పోటీ చేశామని, తమ హామీలు కూడా కలిసి నెరవేరుస్తామని చెప్పాలని, అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పది వేలు ఇస్తే అప్పుడు వెంటనే రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పదివేలు జత చేసి వేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి విధివిధానాలు నిర్ణయం కాకపోయినా పీఎం కిసాన్ సమ్మాన్ కింద అర్హులైన వారికే ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఎన్నికల సమయంలో...
ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇప్పటికే ఫించన్ పెంపు, దీపం పథకాలను, మెగా డీఎస్సీ ప్రకటన, అన్న కాంటీన్ల పునరుద్దరణ వంటి వాటిని అమలు చేశారు. అలాగే మరికొన్ని హామీలను కూడా అమలు చేసే దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఖజానాలో డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చి అయినా పథకాలు అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. వచ్చే విద్యాసంవత్సరంలోపు తల్లికి వందనం అమలు చేయాలని కూడా నిర్ణయించారు. పాఠశాలల పునప్రారంభంలోపు మెగా డీఎస్సీ అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యాసంస్థల యాజమాన్యాలతో మాట్లాడి కొత్త విద్యాసంవత్సరం ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ చెల్లింపులు చేయాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు. అంటే ఇక రానున్న కాలంలో వరసగా ఒక్కొక్క హామీని అమలు చేసేందుకు అవసరమైన నిధుల సేకరణ బాధ్యతను చంద్రబాబు అధికారులపై ఉంచారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News