YSRCP : వైసీపీ ఒకటి తలిస్తే.. మరొకటి... జనం దారుణంగా దెబ్బకొట్టడానికి కారణం ఏంటంటే?

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్మాణం చేపడతామని ప్రకటించారు

Update: 2024-06-16 07:42 GMT

రాజకీయాల్లో ఏది కలసి వస్తుందని భావిస్తామో.. అదే ఒక్కోసారి ఎదురుతంతుంది. ఎన్నికల ముందు వరకూ తమకు అదే వరమని భావించినా.. చివరకు ఫలితాలు తేలేనాటికి శాపమని తేలుతుంది. ఇప్పుడు వైసీపీ విషయంలో అదే జరిగింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్మాణం చేపడతామని ప్రకటించారు. అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలన రాజధానిగా ప్రకటించారు. మూడు ప్రాంతాలకు న్యాయం చేయాలనే జగన్ ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు. అయితే ఇందులో న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకావడంతో అది కార్యరూపం దాల్చలేదు.

మూడు రాజధానుల అంశం...
నిజానికి మూడు రాజధానుల అంశం ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దారుణంగా దెబ్బతీస్తుందని భావించారు. ఎందుకంటే తమ ప్రాంతాలకు రాజధాని వస్తుందని భావించి టీడీపీకి వ్యతిరేకంగా నిలబడతారనుకున్నారు. రాజధాని వస్తే తమకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు భూముల ధరలకు కూడా రెక్కలు వస్తాయని భావించి అందరూ తమ వైపు చూస్తారని వైసీపీ నేతలు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. రాజధాని అంటూ ఏర్పడితే అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని ఎవరైనా భావిస్తారు. ఎందుకంటే కర్నూలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటే దానిని మార్చారు. తర్వాత హైకోర్టును కూడా ఇవ్వలేదన్న కోపంతో జనం ఉన్నారని వైసీపీ నేతలు అనుకున్నారు.
మైండ్ బ్లాంక్ అయిందిగా...
కానీ తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. వైసీపీ నేతలు అంచనాలు తిరగబడ్డాయి. తిరగబడటం అంటే ఆషామాషీగా కాదు. వారు ఊహించని విధంగా. అమరావతి రాజధాని నుంచి అన్నింటినీ తరలించడంతో సహజంగా అక్కడ కొంత వ్యతిరేకత ఉంటుందని అనుకున్నారు. ఈసారి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీకి జీరో స్థానాలు వచ్చాయి. పదహారు స్థానాలున్న ఉమ్మడి కృష్ణా, పదిహేడు స్థానాలున్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైసీపీ ఖాతాలో పడలేదు. అక్కడ టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక న్యాయరాజధానిగా ప్రకటించిన కర్నూలు జిల్లాలో పథ్నాలుగు నియోజకవర్గాలుంటే రెండింటిలోనే వైసీపీ గెలిచింది.
మెజారిటీలు కూడా...
ఇక ఉత్తరాంధ్రలో విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటిస్తే అక్కడ శ్రీకాకుళం లో జీరో, విజయనగరంలో జీరో సీట్లు వచ్చాయి. రెండు జిల్లాల్లో వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కలేదు. విశాఖ జిల్లాలో పదిహేను స్థానాలుంటే కేవలం రెండు స్థానాలు మాత్రమే వచ్చాయి. అంటే ఇక్కడ రాజధాని అంశం అనేది అస్సలు పనిచేయలేదనేచెప్పాలి. పైగా రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన నియోజకవర్గాలు కూడా విశాఖ జిల్లాలోనే ఉండటం విశేషం. రాష్ట్రంలోనే అత్యధికంగా గాజువాక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు 95,235 ఓట‌్ల మెజారిటీ వచ్చింది. తర్వాత స్థానంలో భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు నిలిచారు. గంటాకు 92,401 మెజారిటీ దక్కింది. ఇక మూడో స్థానంలో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ఉన్నారు. లోకేష్ కు 91,413 ఓట్ల మెజారిటీ వచ్చింది. నాలుగోస్థానంలో విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గంలో జనసేన నుంచి పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబుకు 81,870 ఓట్లు వచ్చాయి. అంటే కేపిటల్ అంశానికి ఎవరూ మొగ్గు చూపలేదనే అర్థమవుతుంది.


Tags:    

Similar News