అమరావతి.. మనందరిదీ: సీఎం జగన్‌

వాక్చాతుర్యంతో కూడిన ప్రసంగంలో సీఎం జగన్.. తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని పునరుద్ఘాటించారు.

Update: 2023-07-24 10:57 GMT

వాక్చాతుర్యంతో కూడిన ప్రసంగంలో సీఎం జగన్.. తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని పునరుద్ఘాటించారు. అమరావతి సీఆర్‌డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో సీఎం జగన్ పర్యటించి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. 25 లేఅవుట్లలో పెదలందరికి ఇల్లు కింద పేదలకు 50,793 ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జూలై 24న శంకుస్థాపన చేశారు. పైలాన్‌ను ఆవిష్కరించి ప్రభుత్వం లబ్ధిదారుల కోసం నిర్మించిన మోడల్‌ ఇంటిని పరిశీలించి పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటపాలెంలో భారీ ఎత్తున ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

సీఎం జగన్ మాట్లాడుతూ పేదల వ్యతిరేకులే తమ ప్రభుత్వానికి శత్రువులని అన్నారు. తమ ప్రభుత్వ చర్యల పట్ల పేదల వ్యతిరేకులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అమరావతి సెంటిమెంట్‌ను రేకెత్తించిన సీఎం జగన్.. అమరావతి చరిత్రలో ఈరోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నారు. ఇది 'సామాజిక అమరావతి' అని, ఇది ప్రజలందరి కోసం అని ఆయన అన్నారు. ఇక నుంచి అమరావతి మన అందరిది అంటూ సీఎం జగన్ నినదించారు. స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్న వారి ఆధిపత్యాన్ని, దోపిడీని భరించే రోజులు పోయాయన్నారు. ఈ మార్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును నిర్దేశిస్తుందని సీఎం జగన్ అన్నారు.

దోపిడీదారుల శకం ముగిసిందని ఆయన అన్నారు. ఈరోజు తాను 'సామాజిక అమరావతి'కి శంకుస్థాపన చేస్తున్నానని, ఇకపై అమరావతిలో సామాన్యుల ప్రయోజనాలను కాపాడుతామని, ప్రభుత్వం ఆ దిశగా మాత్రమే పనిచేస్తుందని సీఎం జగన్ ప్రజలకు ప్రతిజ్ఞ చేశారు. పెత్తందారుల మీద పేదల ప్రభుత్వం సాధించిన విజయంగా అభివర్ణించిన సీఎం జగన్‌.. పేదలకు ఇళ్లు రాకూడదనే కుట్ర చంద్రబాబు, దత్తపుత్రుడు చేసారని ఆరోపించారు. వీళ్లకు తోడు చంద్రబాబు పుట్టించిన ఊరు-పేరు లేని సంఘాలు. వీళ్లంతా పేదవాడికి ఇల్లు రాకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు.

Tags:    

Similar News