Chandrababu : కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు... కూటమి నేతలను గౌరవించాల్సిందే
కలెక్టర్ల సదస్సు ముగింపులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.;

కలెక్టర్ల సదస్సు ముగింపులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను దేనికైనా సిద్ధమని ఆయన తెలిపారు. అదే సమయంలో కలెక్టర్లు కూడా తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, అసలైన లబ్దిదారులను గుర్తించడమే కాకుండా వారికి ప్రభుత్వం నుంచి ప్రయోజనం చేకూర్చేందుకు సహకారం అందించాలని ఆదేశించారు. కిందిస్థాయి ఉద్యోగులపై నిరంతరం నిఘా పెట్టడమే కాకుండా అవినీతికి తావు లేకుండా వ్యవహరిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా జిల్లాలో పాలన సాగించాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం...
రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను దేనికైనా సిద్ధమన్న చంద్రబాబు నాయుడు సూపర్ -6 హామీలను అమలు చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని కలెక్టర్లతో తన మనసులో మాట చెప్పారు. తాను నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఇంత రాజకీయంగా అనుభవం ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ఆర్థిక మంత్రిని తరచూ కలవాల్సి వస్తుందని అన్నారు. అందుకు తాను బాధపడటం లేదని, కానీ ప్రజల సంక్షేమం కోసం తాను ఏ విషయంలోనైనా వెనకాడననిన తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఉందని...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందని గుర్తుంచుకోవాలని చంద్రబాబు తెలిపారు. కూటమి నేతలకు అధికారులు గౌరవం ఇవ్వాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. అయితే అదే సమయంలో తప్పుడు పనులకు సపోర్ట్ చేయాల్సినవసరం లేదని చంద్రబాబు కలెక్టర్లకు తెలిపారు. రాష్ట్రానికి ఇప్పటి వరకూ ఏడు లక్షల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు వచ్చాయన్న చంద్రబాబు నాయుడు ఎక్కడా వేధింపులు ఉండరాదని కూడా తెలిపారు. నాలా వల్ల లేఅవుట్లు ఆలస్యమవుతున్నాయనే నాలా చట్టం రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.