Chandrababu : చేయి చాచకుండానే పథకం సక్సెస్ చేసే సత్తా చంద్రబాబుది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఎప్పుడూ ఒకడగు ముందుంటాయి.;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఎప్పుడూ ఒకడగు ముందుంటాయి. ప్రజల సొమ్ము ఖర్చు చేయకుండా అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమ పథకాలను కొనసాగించడంపైనే ఆయన నిరంతరం ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే ఉగాది నుంచి పీ4 పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. నిజానికి ఇది చంద్రబాబు చేస్తున్న ఒక విన్నూత్న ప్రయోగమనే చెప్పాలి. గతంలో జన్మభూమి పేరిట చంద్రబాబు గ్రామాల అభివృద్ధికి అంతో ఇంతో దోహదపడ్డారు. ఇప్పుడు అదేతరహాలో పేద రికం నిర్మూలనకు సంపన్నులను ఆసరాగా తీసుకుని ముందుకు వెళ్లాలన్న ఆయన ఆలోచనకు అందరూ జై కొట్టాల్సిందే. చంద్రబాబు అంటే నమ్మకంతో పాటు నాయకత్వం అన్నది బ్రాండ్ కావడంతో ఆయన అమలు చేసే ఈ పధకం కూడా సక్సెస్ అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ తో...
చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ మేరకు విరాళాలు వెల్లువలా వచ్చిన రోజులు అనేకం ఉన్నాయి. గతంలో ఎప్పుడు ఆయన పిలుపునిచ్చినా రాష్ట్రంలో ఉన్న సంపన్నులతో పాటు ఎన్నారైల నుంచి కూడా భారీ గా స్పందన వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు.2024 ఎన్నికలలో గెలిచిన తర్వాత అన్నా క్యాంటిన్లు తిరిగి ప్రారంభించడంతో దానికి కూడా విరాళాలు కోట్లలో వచ్చాయి. బుడమేరు ముంపు బాధితులను ఆదుకునేందుకు వందల కోట్ల నిధులు చంద్రబాబు చేయి చాచకుండానే సేకరించగలిగారు. అందుకే చంద్రబాబు నాయుడు ఈ పథకం ద్వారా సంపన్నులు ఆసరగా నిలిస్తే పేదలు తమ కాళ్ల మీద నిలదొక్కుకుంటారని భావించి దీనిని అమలులోకి తెస్తున్నారు.
ఎవరైనా ముందుకు రావచ్చంటూ...
సాయం అందించే చేతులకు వేదిక పీ4 లక్ష్యమని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. సంపన్నులు - పేదలను ఒకేచోటకు చేర్చడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ఉగాది నుంచి ఆరంభిస్తున్నారు. ఎన్నారైలతో సహా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకురావొచ్చని చంద్రబాబు పిలుపునిచ్చారు. తొలి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఒక అడుగు వేస్తున్నారు. 2029 కల్లా పేదరికాన్ని నిర్మూలించాలనేది సంకల్పంతో ఉగాది రోజున అమరావతిలో పీ4 ప్రారంభిస్తున్నారు. జీరో పావర్టీ – పీ4 విధానానికి ప్రజాదరణ వస్తుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పడం ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని చెప్పాలి. పేదలకు మద్దతుగా నిలిచేందుగా స్వచ్ఛందంగా ముందుకొచ్చే ఎవరైనా ఈ వేదికను వినియోగించుకోవచ్చని చెబుతున్నారు.
ఇరువర్గాలను ఒకే వేదికపై...
పీ4 విధానంలో ప్రభుత్వ పాత్ర కేవలం ఇరువర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడమేనని, ప్రభుత్వం తరపున ఎవరికీ అదనపు సాయం ఉండదు. . ఉన్నతవర్గాల వాళ్లు సాయానికి ముందుకొచ్చేలా వారిలో స్ఫూర్తి నింపేపనిని చంద్రబాబు తన భుజానికెత్తుకున్నారు. లద్ధి పొందేవారిని ‘బంగారు కుటుంబం’గా, సాయం చేసే వారిని ‘మార్గదర్శి’గా పిలవాలని చంద్రబాబు నినాదం కూడా పీ4, ప్రభుత్వ పథకాల అమలుకు ఎటువంటి సంబంధం లేదు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యంగా దీనిని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసమే పీ 4 పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ పథకం అమలుపై నేడు జిల్లా కలెక్టర్లతో కూడా చంద్రబాబు చర్చించనున్నారు. రాజకీయంగా కూటమికి ఈ పథకం విజయవంతమైతే ఉపయోగపడుతుందని అంచనాలున్నాయి. ఈ పథకం సక్సెస్ అవ్వాలని, పేదలు పేదరికం నుంచి బయటపడాలని ఆశిద్దాం.