Chandrababu : శభాష్ బాబూ.. ఇటువంటోళ్లకు సరైన ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిందే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరు ఏమనుకున్నా ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఒక విషయంలో మాత్రం అందరికీ నచ్చుతారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరు ఏమనుకున్నా ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఒక విషయంలో మాత్రం అందరికీ నచ్చుతారు. చంద్రబాబు మహిళల విషయంలో ఎవరు హద్దులు మీరినా ఊరుకోరు. తాను ఎంత బాధపడ్డారో... ఆ బాధ ఏంటో చంద్రబాబుకు తెలుసు. తన కుటుంబ సభ్యులపైన వైసీపీ నేతలు నాడు నిండు సభలో చేసిన ఆరోపణలతో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు కూడా అప్పట్లో కంటతడిపెట్టించాయి. మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడిన వారిని ఎవరినీ ఉపేక్షించేది లేదని నాడు హెచ్చరించారు. నాడు అదే కారణంతో సభ నుంచి బయటకు వచ్చారు. కౌరవ సభలో ఉండలేనని, గౌరవసభకు ముఖ్యమంత్రిగా అడుగుపెడతానని శపథం చేసి మరీ ముఖ్యమంత్రి అయి మళ్లీ శాసనసభలోకి అడుగుపెట్టారు.
హద్దు మీరి ప్రవర్తిస్తుండటంతో...
సోషల్ మీడియాలో కొందరు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. ట్యూబ్ లు ఎక్కువ కావడంతో ఎవరు పడితే వారు మాట్లాడుతున్నారు. దీనికి ఒక నియంత్రణ లేకుండా పోతుంది. అవే వైరల్ గా మారుతుండటంతో మహిళలు కూడా తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా బాధితుడే కావడం గమనార్హం. పార్టీ పై పిచ్చి అభిమానం, ప్రత్యర్థి పార్టీలపై కోపాన్ని రాజకీయ విమర్శలు చేయకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతూ మహిళలను కించపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలు జగుప్సాకరంగా ఉంటున్నాయి. రాజకీయాల్లో ఉండే మహిళలను మాత్రమే కాకుండా రాజకీయ నేతల ఇళ్లలో ఉండే మహిళలను కూడా టార్గెట్ చేస్తున్నారు.
వైఎస్ భారతిపై...
తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే ఖండించే విధంగా ఉన్నాయి. అత్యంత జగుప్సాకరమైన, అవమానకరమైన ఆరోపణలు చేసిన కిరణ్ ను క్షమించకూడదని సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే పట్టుబడుతున్నారంటే ఏ స్థాయిలో అతగాడు మాట్లాడాడన్నది వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికలకు ముందు నుంచి చేబ్రోలు కిరణ్ ఐటీడీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. అతను రాజకీయ పరమైన విమర్శలు ఏమి చేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ వైఎస్ భారతిని కించపర్చేలా మాట్లాడటంతో చంద్రబాబు సయితం ఆశ్చర్యపోయి వెనువెంటనే చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
సొంత పార్టీ నేతలకే...
అంతే కాదు... చేబ్రోలు కిరణ్ పై ఫిర్యాదు చేయాలని సొంత పార్టీ నేతలకే చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యర్థికి చెందిన వారైనా మహిళలను కించపరిస్తే ఊరుకునేది లేదని తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు బలమైన సంకేతాలను ఈ ఘటన ద్వారా పంపగలిగారు. కిరణ్ ను అరెస్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులను కూడా ఆదేశించడంతో ఆఘమేఘాల మీద కిరణ్ ను అరెస్ట్ చేశారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. చంద్రబాబు నాయుడు మహిళల విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో ఇప్పటికే అర్థమయిన సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఇకపై ఒళ్లు దగ్గరపెట్టుకుని వీడియోలు చేయాల్సి ఉంటుంది. అందుకే జనం శభాష్ బాబూ అంటూ నినదిస్తున్నారు.