Andhra Pradesh : అందరి ఇళ్లల్లో తీపికబురు అందించనున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండగ సమయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు.;

Update: 2025-01-12 02:24 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండగ సమయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. అన్ని వర్గాలు ఆనందంగా తమ ఇళ్లలో సంక్రాంతి పండగ జరుపుకునేందుకు అవసరమైన నిర్ణయం తీసుకున్నారు. సుమారు 6,700 కోట్ల రూపాయల విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. దీని వల్ల సుదీర్ఘకాలంగా ఇబ్బందులు పడుతున్న వారు పండగ వేళ ఆనందంగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, కాంట్రాక్టర్లు,పోలీసు సిబ్బంది, ఉద్యోగులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయీలను చెల్లించాలని నిర్ణయించారు. వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు ఈ నిర్ణయం ఉపయోపగడనుంది. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆయన జరిపిన సమీక్షలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పేరుకుపోయిన బకాయీలను చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

పాత బకాయీలను...
ప్రతి ఇంట్లో సంక్రాంతి పండగ పండగలా జరగాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 1.30 లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ముందుగా కాంట్రాక్టర్లకు పది లక్షల లోపు బకాయీ ఉన్న వారికి చెల్లించాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయీలను చెల్లించాలని ఆదేశించారు. దీనివల్ల 6.50 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ బకాయీలు 519 కోట్లు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయీలు 214 కోట్లు, ఉద్యోగులకు సీపీఎస్ ఖాతాల్లో జమ చేయాల్సిన 300 కోట్లు, టీడీఎస్ తో కలిపి మొత్తం పదమూడు వందల కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించారు. పది లక్షల రూపాయల బకాయీలు ఉన్న కాంట్రాక్టర్లందరికీ బిల్లుల చెల్లించాలని ఆదేశించారు. అమరావతి రైతులకు కౌలు బకాయీలు 244 కోట్ల రూపాయలు, చిరు వ్యాపారులకు వంద కోట్ల రూపాయలు, ఆరోగ్య శ్రీ బకాయీలకు ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించారు.


Tags:    

Similar News