ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలయినంత త్వరగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని భావిస్తుంది. జమిలి ఎన్నికలు 2027లో జరుగుతాయనుకుంటున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధమవుతుంది. కొంత మేరకు నిధుల కొరత సమస్య ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్లేందుకు చంద్రబాబు నాయుడు వరసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. వీలయినంత మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో పరుగులు పెట్టించాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు.
జమిలి ఎన్నికల నాటికి...
ఈ నేపథ్యంలో ప్రజలు తిరిగి జమిలి ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపాలంటే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని ఆయన గట్టిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరసగా ఒక్కొక్కటి అమలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలను గ్రౌండ్ చేయగలిగారు. ఇటీవల దీపావళి రోజున ఉచిత గ్యాస్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈపథకానికి మంచి స్పందన రావడంతో పాటు దాదాపు నలభై లక్షల మంది వరకూ నేటికిఉచిత గ్యాస్ సిలిండర్లను అందుకున్నారు. ఎక్కడైనా మహిళ ఓటర్లే కీలకం. వారిని ఆకట్టుకుంటే చాలు సగం అధికారం చేతికి వచ్చినట్లేనని ప్రతి పార్టీ భావిస్తుంది.
రేపు కేబినెట్ లో...
ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో చర్చకు వచ్చే అవకాశముందని తెలిసింది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణ, కర్ణాటకలలో అధ్యయనం చేసి వచ్చిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వచ్చే సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. ఇందుకోసం నిధులను కూడా సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీ ఈలోపు కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పురుషులు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో వాటిని అధిగమించేలా నిర్ణయం ఉండనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.