Andhra Pradesh : ఏపీ వాసులకు శుభవార్త.. మరో నాలుగు రహదారులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో శుభవార్త అందింది. రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో శుభవార్త అందడంతో ఏపీ వాసులు సంతోషపడుతున్నారు. మొత్తం నాలుగు రహదారులను జాతీయ రహదారులుగా విస్తరించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. విశాఖపట్నం - అరకు మార్గంలో నాలుగు లైన్ల రహదారికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో అరకు వెళ్లే పర్యాటకులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుుతాయి. ఇక అరకు వెళ్లడం సులువుగా మారుతుంది. అలాగే విశాఖ- అరకు రూట్లో పెందుర్తి - బౌడరా మధ్య ఎన్‌హెచ్-516బి విస్తరణకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.
పర్యాటక రంగానికి...
దీంతో పాటు పెందుర్తి నుంచి కొత్తవలస, శృంగవరపుకోట మీదుగా బౌడరా వరకూ ఈ రోడ్డు ఉంది. అయితే ఈ రోడ్డును నాలుగు లైన్లకు విస్తరించాలని కేంద్రం నిర్ణయించడంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భారతమాల పరియోజన కింద ఈ రహదారులకు అనుమతులు మంజూరు చేసింది. ఇందుకోసం 956.21 కోట్ల రూపాయల వ్యయం కానుందని అంచనాలు రూపొందించారు. అలాగే విస్తరణ పనుల్లో భాగంగా చింతలపాలెం నుంచి బౌడరా వరకు ఏడు మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డును పదకొండు మీటర్లకు విస్తరిస్తారు. మొత్తం 40.5 కిలోమీటర్ల మేరకు రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం 118 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.