Nara Lokesh : నారా లోకేష్ కామ్ గా పనిచేసుకు పోతున్నారా? బయటకు కనిపించకుండా సెట్ చేస్తున్నారా?
నారా లోకేష్ రాజకీయాల్లో రాటు దేలారు. ఆయన తన తండ్రి చంద్రబాబు నుంచి రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు
నారా లోకేష్ రాజకీయాల్లో రాటు దేలారు. ఆయన తన తండ్రి చంద్రబాబు నుంచి రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. 2014 ఎన్నికల్లో గెలవకపోయినా మంత్రి అయిన నారా లోకేష్ అప్పడు అంతా తానే వ్యవహరించేవారు. తన శాఖలు మాత్రమే కాదు ఇతర శాఖల్లోనూ వేలు పెట్టేవారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఐదేళ్లు పడిన కష్టం, ఎదుర్కొన్న విమర్శలతో ఆయనలోని అసలైన రాజకీయ నేత బయటపడ్డారు. అందులోనూ 2024 ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన యువగళం పాదయాత్ర కూడా ఆయనలో అనేక మార్పులు తెచ్చింది. ఎవరు తమ వాళ్లు.. ఎవరు కాదన్నది నారా లోకేష్ స్పష్టంగా తెలుసుకోగలిగారు.
గతంలో మాదిరిగా...
2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నారా లోకేష్ లో పూర్తిగా మార్పు కనిపిస్తుంది. అంతకు ముందులా దూకుడు ప్రదర్శించడం లేదు. ఎన్నికల ప్రచారంలో తాను చెప్పిన డైలాగులను కూడా ఆయన పక్కన పెట్టేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినీ వదిలేది లేదని ప్రచారంలో ఆయన పదే పదే హెచ్చరికలు జారీ చేసేవారు. రెడ్ బుక్ లో అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్లున్నాయని అధికారంలోకి రాగానే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, తాను చంద్రబాబు లాగా మెతక వైఖరితో వ్యవహరించనని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదంటూ నారా లోకేష్ వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఎన్నికల ప్రచారంలో ఇచ్చారు.
ప్రతి రోజూ....
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ పూర్తిగా తన వైఖరిని మార్చుకున్నట్లు కనపడుతుంది. ప్రతి రోజూ ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించడంతో పాటు ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. వాటి సమస్యలను పరిష్కరించాలని వెంటనే సంబంధిత అధికారులకు పంపుతున్నారు. నారా లోకేష్ వద్దకు వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన ప్రజలు ప్రతి రోజూ ఉండవల్లి ఆయన నివాసం వద్దకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చి తమ వ్యక్తిగత సమస్యలతో పాటు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు గురించి ఫిర్యాదు చేస్తున్నారు. వినతులు అందిస్తున్నారు.
కానీ కనపడకుండా...
కానీ నారా లోకేష్ మాత్రం గత ప్రభుత్వంలో కార్యకర్తలపై మోపిన కేసులు, వారిని వేధించిన వైనాన్ని మాత్రం వదలడం లేదు. ఆయన స్వయంగా తాను పాదయాత్రలో గమనించిన అంశాలపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారని చెబుతున్నారు. ఎవరికీ ఈ విషయం కనపడదు. అలాగే తాను కార్యకర్తలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్లు పార్టీలో బలమైన సంకేతాలను నారా లోకేష్ పంపగలుగుతున్నారు. ఇక అధికారంలోకి రాగానే టీడీపీలోకి రావాలనుకుంటున్న నేతలకు కూడా చెక్ పెడుతున్నారట. నారా లోకేష్ అనుమతి లేనిదే పార్టీలోకి తీసుకోలేమని సంబంధిత జిల్లా మంత్రులు కూడా ఆనేతలకు చెబుతున్నారు. కానీ అటువంటి వారికి నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదట.