Breaking : రాజధాని అమరావతి రైతులపై మరో పిడుగు.. మళ్లీ భూసేకరణ?
అమరావతి రైతులపై మరో పిడుగు పడింది. రాజధాని నిర్మాణం కోసం మరో 30 వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది;

రాజధాని అమరావతి రైతులపై మరో పిడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం మరో ముప్ఫయి వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. కోర్ కాపిటల్ బయట మరో ముప్ఫయివేల ఎకరాలను భూమిని సేకరించాలని భావిస్తుంది. రాజధాని భవిష్యత్ అవసరాల కోసం ఈ ముప్ఫయి వేల ఎకరాలను సేకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతమున్న భూములకు అదనంగా మరో ముప్ఫయి వేల ఎకరాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది.
భవిష్యత్ అవసరాల కోసం...
రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయం, రైల్వే లైన్, పారిశ్రామిక సంస్థల కోసం ఈ ముప్ఫయివేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం రైతులను ఒప్పించి ముప్ఫయి వేల ఎకరాలను సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే రాజధాని రైతులు 29 గ్రామాల పరిధిలో 32 వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. అందులో మొదటి దశ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ పనుల కోసం టెండర్లను పిలిచి ఖరారు చేశారు.
రైతుల నుంచి సేకరించి...
ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత పనులు వేగం అందుకున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న 32 ఎకరాలు సరిపోదని భావించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోర్ కాపిటల్ బయట వైపు మరో ముప్ఫయి వేల ఎకరాలను సేకరించేందుకు సిద్ధమయింది. దీంతో రైతుల గుండెల్లో పిడుగు పడినట్లయింది. రైతులను ఒప్పించే బాధ్యత ప్రస్తుతానికి అధికారులపై ఉంచారు. వారికి నచ్చ చెప్పి రాజధాని అమరావతి ప్రాంతంలో ప్లాట్లు ఇస్తామని చెప్పడంతో పాటు రాజధాని అభివృద్ధికి సహకరించాలని కోరనున్నారు. మరి రైతులు ఏ మేరకు సహకరిస్తారన్నది చూడాల్సి ఉంది.