ఉపరితల ఆవర్తనం.. రెండురోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీలోనూ నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి విస్తరించడంతో పాటు.. వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడా నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాదాపు తెలుగురాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించగా.. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. నేడు నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, రేపు, ఎల్లుండి కూడా ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.