పెరిగిన మృతుల సంఖ్య.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు;
వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగు నుండి ఆరుగురుకు చేరింది. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌ల్లో తిరుపతిలోని ఆసుపత్రులకు తరలించారు. రుయా ఆసుపత్రిలో 20 మంది, స్విమ్స్‌లో 9 మంది చికిత్స పొందుతున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు. అస్వస్థతకు గురైన బాధితులకు అందుతున్న వైద్య చికిత్సపై అధికారులతో సీఎం మాట్లాడారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం ఉదయం చంద్రబాబు తిరుపతికి వెళ్లనున్నారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.