Ys Sharmila : షర్మిల ఆ కోరికయినా నెరవేరుతుందా? అందుకే అగ్రనేతలను కలిశారా?

ఏపీ పీసీసీచీఫ్ వైఎస్ షర్మిల మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి ఓటమిని చవి చూశారు

Update: 2024-06-18 06:01 GMT

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి ఓటమిని చవి చూశారు. వైఎస్ కుటుంబం నుంచి పోటీ చేసి కడప పార్లమెంటు నుంచి ఓడిపోయిన తొలి వ్యక్తిగా పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాగానే కష్టపడ్డారు. సోదరుడు జగన్ పై యుద్ధమే చేశారు. రాష్ట్రమంతటా తిరిగి జగన్ ఓడించడానికి ఒక విధంగా షర్మిల కూడా కూటమి పార్టీలకు పరోక్షంగా సాయపడినట్లే. అయితే ఆమె సుదీర్ఘకాలం కోరిక మాత్రం నెరవేరడం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి వస్తుందనే ఆశ ఉండేది. కానీ కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. తాజాగా ఢిల్లీకి వెళ్లి పార్టీ అగ్రనేతలను కలవడంతో మరోసారి పదవిపై చర్చ మొదలయింది.

విలీనం చేసేటప్పుడు...
ఆమె తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేటప్పడు ఒక ప్రచారం అయితే రాజకీయ వర్గాలలో జోరుగా నడిచింది. పొరుగున ఉన్న కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ సూచనలతోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. అయితే ఏపీ ఎన్నికలలో కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. షర్మిలతో పాటు నేతలందరూ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలిపారు. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ కు బలమైన వాయిస్ వినిపించేది షర్మిల మాత్రమే. ఆమె ప్రభుత్వాన్ని విమర్శిస్తే కొంత వరకూ అధికార పార్టీని ఇరకాటంలో పెట్టవచ్చన్నది ఢిల్లీ పెద్దల ఆలోచన.
రాజ్యసభ పదవి ఇస్తారంటూ...
అయితే వైఎష్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేేసేటప్పుడు రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు ఎంపిక చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఏపీ ఎన్నికలు రావడంతో దానిని వాయిదా వేసినట్లు కూడా వైఎస్ షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడు కర్ణాటక నుంచి తనకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని ఢిల్లీ పెద్దలను షర్మిల కోరినట్లు తెలిసింది. తనకు పదవి ఉంటే ఇటు అధికార పార్టీ టీడీపీ, అటు ప్రతిపక్ష వైసీపీ పోరాడేందుకు అవసరమైన శక్తి లభిస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ కు చెప్పినట్లు తెలిసింది. సోమవారం ఢిల్లీలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసి రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
కర్ణాటక నుంచి ఇప్పుడు...
కానీ వైఎస్ షర్మిలకు రాజ్యసభ పదవి ఇస్తామన్న హామీ ఏ మేరకు పార్టీ అమలుచేస్తుందన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. ఇప్పటికే కర్ణాటకలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నేతలకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు ఎంత మాత్రం అక్కడి నేతలు సహకరిస్తారన్నది పెద్ద సమస్యగా మారింది. అక్కడ నేతలనే పదవులతో సంతృప్తి పర్చాల్సి ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో కర్ణాటక నుంచి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాన్ని వైఎస్ షర్మిల కోసం రిజర్వ్ చేస్తారా?లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కర్ణాటక కాకపోయినా మరో రాష్ట్రం నుంచి తనను రాజ్యసభకు పంపాలని ఒక రిక్వెస్ట్ ను అయితే హైకమాండ్ ముందు వైెఎస్ షర్మిల పెట్టి వచ్చారు. మరి చివరకు షర్మిలకు పార్టీ ఇచ్చిన హామీ నెరవేరతుందా? లేదా? అన్నది కాలమే నిర్ణయించాలి.


Tags:    

Similar News