64 ఏళ్ల వయసులో డిప్యూటీ స్పీకర్ సాహసం.. గంటపాటు జలాసనం

జలాసన ప్రక్రియ పూర్తయిన అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి.. క్రీడ‌ల ప్రాధాన్య‌త‌ను..

Update: 2023-07-11 07:32 GMT

ఆరుపదుల వయసు దాటినా.. ఏపీ డిప్యూటీ స్పీకర్ వారెవ్వా అనేలా అందరినీ ఆశ్చర్య పరుస్తూ.. గంట సమయం పాటు నీటిపై యోగా సాధన చేశారు. విజ‌య‌న‌గ‌రం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర శాస‌న స‌భ డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి తన వయసును ఏ మాత్రం లెక్కచేయకుండా గంటసేపు జలాసనం వేసి అందరినీ అబ్బుర పరిచారు. క్రీడా రంగ విశిష్ట‌త‌ను, క్రీడ‌ల ప్రాధాన్య‌త‌ను నేటి యువ‌తరానికి తెలియ‌జేయాల‌నే సంక‌ల్పంతో ఆయ‌న చేప‌ట్టిన కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా సాగింది. జాతీయ‌ స్విమ్మింగ్ పూల్ డే ను పుర‌స్క‌రించుకొని మంగ‌ళ‌వారం స్థానిక ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సులోని స్విమ్మింగ్ పూల్‌లో డిప్యూటీ స్పీక‌ర్ నిర్వ‌హించిన జ‌లాస‌న ప్రక్రియ అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర శాస‌న స‌భ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర‌, విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ప్రారంభించారు. డిప్యూటీ స్పీకర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి వేసిన జలాసనాన్ని అభినందించారు.

జలాసన ప్రక్రియ పూర్తయిన అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి.. క్రీడ‌ల ప్రాధాన్య‌త‌ను నేటి యువ‌త‌రానికి తెలియ‌జేయాల‌న్నదే త‌న ముఖ్య ఉద్దేశ‌మ‌ని, అందుకే ఈ వ‌య‌సులో కూడా ఇలాంటి సాహ‌సాన్ని చేశాన‌ని పేర్కొన్నారు. యువత స్మార్ట్ ఫోన్లు, టీవీల మోజులో పడి ఆరోగ్యాన్నిచ్చే క్రీడలకు దూరం అవుతున్నారని, ఇకనైనా క్రీడల ఆవశ్యకతను తెలుసుకుని వాటికి ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయోజనకర నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. త‌న వంతుగా న‌గ‌రంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాన‌ని, మహిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా పార్కును నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని చెప్పారు. ప్ర‌జ‌లు కూడా వారి ఆరోగ్యానికి ప్రాధాన్య‌త ఇస్తూ నిత్యం క్రీడా సాధ‌న చేయాల‌ని డిప్యూటీ స్పీక‌ర్ హిత‌వు ప‌లికారు. వ‌య‌సుతో సంబంధం లేని క్రీడ‌.. స్విమ్మింగ్ అని దీనిని రోజూ సాధ‌నం చేయ‌టం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని సూచించారు.







Tags:    

Similar News