బాలకృష్ణ.. బాబు ఫొటోను లేపేశారే
ఎన్టీఆర్ ఆరోగ్య రథం వైద్య సేవలను హిందూపురం నియోజకవర్గం ప్రజలకు బాలకృష్ణ అందుబాటులోకి తెచ్చారు
నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తరచూ అక్కడ పర్యటిస్తూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హిందూపురం ప్రజల కోసం సొంత కార్యక్రమాలను కూడా బాలకృష్ణ చేపడుతున్నారు. తాజాగా నిన్న ఎన్టీఆర్ ఆరోగ్య రథం వైద్య సేవలను ప్రజలకు బాలకృష్ణ అందుబాటులోకి తెచ్చారు. ఆ వాహనం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే ప్రయత్నానికి నందమూరి బాలకృష్ణ శ్రీకారం చుట్టారు.
200 రకాల పరీక్షలు..
తన సతీమణితో కలసి హిందూపురంలో పర్యటించిన నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఆరోగ్యరథంను ప్రారంభించారు. ఈ వాహనం ద్వారా ఉచితంగా ఆరోగ్య సేవలను ప్రజలకు అందించనున్నారు. దాదాపు 200 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. హిందూపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తిరుగుతూ వైద్యాన్ని ప్రజల వద్దకు చేరవేయడమే లక్ష్యంగా ఈ ఆరోగ్య రథాన్ని రూపొందించారు. ఇందులో ఒక డాక్టర్, నర్సుతో పాటు పార్మాసిస్టు, ఆరుగురు సిబ్బంది ఉంటారు. మందులను కూడా ఉచితంగానే ఇవ్వనున్నారు.
ఇద్దరి ఫొటోలే....
దాదాపు నలభై లక్షల రూపాయల సొంత డబ్బును వెచ్చించి ఈ ఆరోగ్యరథాన్ని బాలకృష్ణ ప్రత్యేకంగా తయారు చేయించారు. అయితే ఈ రధంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ ఫొటోలను మాత్రమే ముద్రించారు. పార్టీ అధినేత ఫొటో లేకపోవడంతో పార్టీలో నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే సొంత ఖర్చుతో వాహనం రూపొందించి ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారు కాబట్టి తన తండ్రి ఎన్టీఆర్, తన ఫొటోలను మాత్రమే ఈ వాహనంపై నందమూరి బాలకృష్ణ ఉంచినట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఆరోగ్య రథం హిందూపురం నియోజకవర్గంలో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.