ఏపీకి గుడ్ న్యూస్.. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు !
ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. తూ.గో. జిల్లా రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్డును మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. తూ.గో. జిల్లా రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్డును మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ నుంచి రాజమండ్రి ఎంపీ భరత్ కు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజమండ్రి చుట్టూ 25 నుంచి 30 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. కాగా.. రాజమండ్రికి కేంద్రం ఓఆర్ఆర్ ను మంజూరు చేయడంపై ఎంపీ భరత్ స్పందించారు.
హర్షం వ్యక్తం చేసిన ఎంపి
రాజమండ్రికి ఓఆర్ఆర్ ను మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి చరిత్రలోనే నేడు మరచిపోలేని రోజు అని ఎంపీ భరత్ పేర్కొన్నారు. రాజమండ్రికి రింగ్ రోడ్డు సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.1000 కోట్ల వరకూ ఖర్చవుతుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. ఏపీలో రచ్చచేస్తున్న టికెట్ల రేట్ల తగ్గింపు వివాదంపై కూడా ఎంపీ భరత్ స్పందించారు. సంక్రాంతి పండక్కి బెనిఫిట్ షో ల పేరుతో రేట్లు పెంచడానికి ఒక హద్దు ఉండాలన్న ఆయన.. సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ఇస్తున్న డబ్బును థియేటర్ల యాజమాన్యాలు టికెట్ల రూపంలో లాగేసుకుంటున్నాయని మండిపడ్డారు.