Andhra Pradesh : అడుగు తప్పు వేస్తే.. అట్టడుగుకు.. రైట్ వే అయితే నాన్ స్టాప్ జర్నీ

ఎన్టీఆర్ అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ జీవితం నేటి తరానికి ఒక పాఠంగా చెప్పాలి;

Update: 2025-03-02 05:58 GMT
political careers,  chandrababu, daggubati venkateswara rao, ap politics
  • whatsapp icon

రాజకీయాలంటే అంత సులువు కాదు. అంది వచ్చిన అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకోవడం అందరికీ సాధ్యం కాదు. కొందరికి మాత్రం రాజకీయాల్లో ఆనుపానులు తెలియడంతో ఖచ్చితమైన మార్గంలో పయనిస్తారు. మరికొందరు అదే సమయంలో రాంగ్ స్టెప్ వేసి తమ పొలిటికల్ కెరీర్ కు తామే ఫుల్ స్టాప్ పెట్టుకుంటారు. అటువంటి వారిలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావులు పోల్చి చూస్తే రాజకీయాలు ఎవరిని ఏ స్థాయికి చేరుస్తాయన్నది చెప్పకనే తెలుస్తుంది. ఎత్తులు, పైఎత్తులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే తప్ప పాలిటిక్స్ లో విజయం సాధ్యం కాదన్నది ఈ ఇద్దరి రాజకీయ జీవితాలు రుజువు చేశాయి.

భవిష్యత్ తరానికి...
భవిష్యత్ తరానికి కూడా ఈ ఇద్దరు విషయం ఒక పాఠంగా చెప్పాలి. 1995 ప్రాంతంలో అప్పటి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నుంచి పార్టీని చేజిక్కించుకున్నప్పుడు జరిగిన ఘటనలు ఇద్దరి రాజకీయ జీవితాల్లో పెను మార్పులు తెచ్చి పెట్టాయి. అప్పటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ను వ్యతిరేకించడం ఎవరూ తప్పుపట్టరు. అదే సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీసుకున్న నిర్ణయం ఆయన పొలిటికల్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. ఎన్టీఆర్ సమయంలో మంత్రి పదవి మాత్రమే ఆయనకు చివరకు మిగిలింది. ముప్ఫయి ఏళ్ల నుంచి ఆయన పార్టీలు మారుతున్నా ఆయన రాజకీయ జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదు. మాజీ ఎంపీ, మాజీ మంత్రిగానే దగ్గుబాటి వెంకటేశ్వరరావు మిగిలిపోవాల్సి వచ్చింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావడానికి ప్రధాన భూమిక పోషించిన దగ్గుబాటి నేడు రాజకీయ సన్యాసం తీసుకునే పరిస్థితి ఏర్పడింది.
రాజకీయ చతురతతో...
చంద్రబాబు విషయం వేరే చెప్పాల్సిన పనిలేదు. 1995 లో పార్టీని తన చేతుల్లోకి తీసుకుని ముఖ్యమంత్రి అయిన ఆయన ఇక వెనుదిరిగి చూడలేదు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన వ్యవహరించారు. ఓటములు ఎదురైనా కుంగిపోలేదు. నాడు తాను చేసింది కరెక్టేనని పార్టీ క్యాడర్ తో పాటు ప్రజలను కూడా నమ్మించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఎటువంటి గ్లామర్ లేకుండా, బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం తన మేధస్సుతోనే చంద్రబాబు రాజకీయాల్లో రాణించారని చెప్పాలి. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ పార్టీని నాలుగు దశాబ్దాలుగా ఒంటి చేత్తో నడిపిస్తూ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ కు మించి చంద్రబాబు క్యాడర్ లో మంచి మార్కులు కొట్టేశారు. తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకుని చంద్రబాబు వల్లనే ఏపీ సమగ్రాభివృద్ధి సాధ్యమని జనం నమ్మే విధంగా ఆయన తీసుకెళ్లగలిగారంటే ఖచ్చితంగా నాయుడుకున్న ముందు చూపు వేరు అని వేరే చెప్పాల్సిన పనిలేదు.
మూడు దశాబ్దాల తర్వాత...
ఎన్టీఆర్ కు పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాగా, చిన్నల్లుడు చంద్రబాబు. అయితే చిన్నల్లుడు మాత్రమే సక్సెస్ అయ్యారు. పెద్దల్లుడు అట్టర్ ప్లాప్. వీరిద్దరూ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలవనున్నారు. దగ్గుబాటి రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. ఆయనను ఇటీవల కలసిన దగ్గుబాటి ఆహ్వానం పలకడంతో తాను వస్తానని చెప్పి చంద్రబాబు మరింత ఎత్తుకు ఎదిగిపోయారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇక రాజకీయంగా ఎదగలేరు. అలాగే చంద్రబాబు ను ఎవరూ అంతకు మించి కిందకు దించలేరు. మధ్యలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన దగ్గుబాటిని చంద్రబాబు వెళ్లి పరామర్శించి వచ్చారు. దగ్గుబాటికి ఇప్పుడు తన రాజకీయ జీవితం అనవసరం. ఆయన దాదాపు సన్యాసం తీసుకున్నట్లే. ఇక ఆయన కుమారుడు రాజకీయ భవితవ్యం కోసమే దగ్గుబాటి ప్రయత్నిస్తున్నారన్నది కూడా అంతే నిజం. కనీసం ఎమ్మెల్యే, మంత్రి స్థాయిలోనైనా తన కుమారుడిని చూడాలన్న ఆయన కోరిక నెరవేరుతుందా? లేదా? అన్నది కాలమే తేల్చనుంది.


Tags:    

Similar News