Ap Politics : 12న మోదీ ఏపీకి వస్తే ఆ హామీ ఇస్తారా.. చంద్రబాబు ప్రయత్నమే అదటగా
ఢిల్లీలో ఉన్న చంద్రబాబు ఎన్డీఏ నేతలను తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు.
ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు ఎన్డీఏ నేతలను తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. 12న అమరావతిలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రానున్నారని తెలిసింది. ఇద్దరూ చంద్రబాబు ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో ఆయన అతిరధమహారధులను ఈ కార్యక్రమానికి ఆహ్వనం పలుకుతున్నారు.
స్పష్టత వచ్చేలా....
అయితే చంద్రబాబు మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ చేత ముఖ్యమైన అంశాలపై స్పష్టత ఇప్పించేలా ఆయనను ఒప్పించనున్నారని సమాచారం. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోనే ఆ హామీలు ఆయన నోటి వెంట ఏపీ ప్రజలకు వినిపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయం కాకపోయినా రాజధాని అమరావతి నిర్మాణం కోసం నిధులు, పోలవరం నిర్మాణం పూర్తయ్యేందుకు అవసరమైన సహకారం వెంటనే అందిస్తామని మోదీ నోటి నుంచి చెప్పించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నట్లు తెలిసింది. ఆయన నోటి నుంచి వచ్చే మాటలు తన పాలనకు మరింత దోహదపడతాయని ఆయన భావిస్తున్నారు.
గత ఐదేళ్లుగా...
గత ఐదేళ్లుగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని కూడా చంద్రబాబు భావించి ఆయన ఎన్డీఏ పక్షాన నిలబడ్డారు. తమ గెలుపులో భాగస్వామి అయిన బీజేపీ తోనే తాను అనుకున్న పనులు సాధించుకునేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. ఏపీకి రావాల్సిన నిధులతో పాటు విభజన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించుకుని ఏపీని వీలయినంత త్వరగా సూచికలో దూసుకు పోయేలా చూడాలన్న అభిప్రాయంలో ఉన్నారు. అందుకే ఈ నెల 12న మోదీ ఏమి మాట్లాడనున్నారు? ఏపీకి ఎలాంటి హామీలు ఇవ్వనున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీ వరస పర్యటనలతో మోదీ భారీ ప్రకటన చేయవచ్చన్నది అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది.