Andhra Pradesh : ఆయనొస్తే.. ఈయన.. ఈయనొస్తే ఆయన... ఏపీ గతి ఇక అంతేనా?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకనే సంక్షేమ పథకాలను అమలు చేయలేదని చంద్రబాబు చెబుతున్నారు. రేపు జగన్ కూడా అలా అనరన్న గ్యారంటీ లేదు;

Update: 2025-01-28 07:30 GMT
chandrababu, ys jagan, welfare schemes, ap politics
  • whatsapp icon

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకనే సంక్షేమ పథకాలను అమలు చేయలేదని చంద్రబాబు చెబుతున్నారు. రేపు జగన్ కూడా అలా అనరన్న గ్యారంటీ లేదు. చంద్రబాబు చెప్పినట్లు వరసగా అధికారం ఎవరికి ఇవ్వకపోయినా అభివృద్ధి పథకాలు ఆగిపోతాయి. అందులో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక రాజకీయాలున్నాయి. అందుకు రాజకీయ నేతలే కారణం. వ్యక్తిగత కక్షలతో ఏపీలో రాజకీయాలు చేసుకునే వారు ఎక్కవగా ఉన్నారు. ఇందులో ఎవరూ మరొకరికంటే తక్కువ కాదు. వైసీపీ అధికారంలో ఉండగా కమ్మ సామాజికవర్గం వారి ఆర్థిక మూలాలను చెరిపేయడానికి జగన్ ప్రయత్నించారు. అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే టీడీపీకి ఆర్థికంగా సాయం చేయగలిగిన వారిని ఆర్ధికంగా లేవనివ్వకుండా కొట్టగలిగితే తాను ఎన్నికలలో సులువుగా విజయం సాధించాలని భావించి ఆ పనికి దిగారు. ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ ఆ విషయంలో మాత్రం వెనక్కు తగ్గలేదు.

అన్నీ నిలిపేసి...
అలాగే చంద్రబాబు 2014లో మొదలు పెట్టిన అనేక అభివృద్ధి పనులను తాను అధికారంలోకి రాగానే నిలిపేశారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా నిలిపేశారు. అమర్ రాజా వంటి కంపెనీలపై దాడులు చేశారు. పలు కంపెనీలు వెనక్కు పంపేలా చేశారు. ఎందుకంటే జగన్ ప్రాధాన్యతలు వేరు. ఆయన పూర్తిగా సంక్షేమంపైనే ఆధారపడి పాలన ఐదేళ్ల పాటు సాగించారు. తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకు ఏర్పాటవుతుందని, తద్వారా తన గెలుపు మరోసారి సాధ్యమవుతుందని భావించారు. అందుకే ఆయన సంక్షేమ పథకాలకు దాదాపు ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు లబ్దిదారులకు అందచేశారు. అప్పులు తెచ్చి మరీ సంక్షేమాన్ని అమలు చేయడానికి జగన్ ఏమాత్రం వెనకాడలేదు.
బాబు అధికారంలోకి రాగానే...
ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చీ రాగానే తన ప్రయారిటీ ఇదీ అని చెప్పకనే చెప్పారు. అమరావతి, పోలవరం నిర్మాణం తొలి ప్రాధాన్యత అని ఆయన చెప్పారు. అలాగే వాటికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ సంక్షేమానికి తన వద్ద డబ్బుల్లేవంటున్నారు. ఈయన ప్రాధాన్యతలు ఇవీ. జగన్ పెట్టిన పలు సంక్షేమ పథకాలకు పేరు మార్చారు. అంతే కాదు ఆరోగ్య శ్రీ వంటి పథకాలను కూడా ఎత్తివేయడానికి బీమా పథకాన్ని తెచ్చే యోచనను చంద్రబాబు చేశారు. అయితే ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబుకు తెలియదా? అంటే అంతా తెలుసు. కానీ గెలుపు కోసం అలివికాని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తానేమీ చేయలేనని అర్థం చేసుకోవాలంటూ జనాన్ని కోరుతున్నారు.
కొందరిలో అలా.. మరికొందరిలో ఇలా...
జనం మాత్రం మొన్నటి వరకూ తమ బ్యాంకు ఖాతాల్లో ఏదో ఒక పథకం ద్వారా ప్రభుత్వం నుంచి డబ్బులు పడేవి. అయితే గత ఏడు నెలలుగా అవి అందడం లేదు. సహజంగా ఒకవర్గం ప్రజల్లో ఇది అసంతృప్తి ఎక్కువగానే ఉంది. వారంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేసే వారే. కానీ ఎక్కువ మంది చంద్రబాబు ఆలోచనను కూడా సమర్ధిస్తున్నారు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తే ఎలా? రాష్ట్రం ఇక ఎప్పుడు డెవలెప్ అవుతుంది? తమ తర్వాత తరం ఇబ్బందులు పడాల్సి వస్తుందోనన్న ఆందోళన ఎక్కువ మంది ప్రజల్లో ఉందని కూడా అంతే నిజం. అందుకే ఏపీలో ప్రభుత్వం మారినా ఒకరి పాలనపై మరొకరు సాకులు చెప్పుకుంటారు. వారిపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ఫిక్స్.. ఇందులో ఏమాత్రం మార్పు ఉండదు. ఎన్నికలకు ముందు ఒకరీతిలో.. ఎన్నికల తర్వాత మరొక తీరులో వ్యవహరించడం ఏపీ పొలిటికల్ లీడర్స్ అందరికీ వెన్నతో పెట్టిన విద్య. మధ్యలో మాత్రం మోసపోయేది జనం మాత్రమేనన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. మరి ఏపీని ఇక ఎవరూ బాగుపర్చే అవకాశం లేదా?


Tags:    

Similar News