Nara Lokesh : లోకేష్ కు ఇప్పట్లో ఆ అవకాశం లేనట్లేనా? చంద్రబాబు చెప్పేశారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నేత. లోకేష్ రాజకీయ భవితవ్యంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు

Update: 2025-01-23 06:58 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నేత. ఆయన ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడతారు. రాజకీయంగా ఆయన నిలదొక్కుకున్నారంటే ఆయన సమర్థతే అందుకు కారణమని ఎవరైనా ఒప్పుకుంటారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమే అయినట్లుగానే గెలుపోటములు కూడా అంతే సహజం. కానీ నాలుగు దశాబ్దాల నుంచి పార్టీని కాపాడుకుంటూ నాలుగు సార్లు అధికారంలోకి తేవడం అంటే ఆషామాషీ కాదు. అందులోనూ తక్కువ సంఖ్యలో జనాభా ఉన్న సామాజికవర్గం నుంచి వచ్చిన నేత అవ్వడంతో పాటు గ్లామర్ లేని నేతగా ఉండటంతో పాటు, ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయలేరన్న పేరున్న చంద్రబాబు ఇలా పార్టీని అధికారంలోకి తేగలిగారంటే ఆయన సత్తా మాత్రమేనని అందరూ ఒప్పుకోవాల్సిందే.

దావోస్ లో కామెంట్స్...
కానీ అలాంటి చంద్రబాబు నాయుడు దావోస్ లో వారసత్వ రాజకీయాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ రాజకీయ వారసత్వం గురించి గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. భవిష్యత్ నేత లోకేష్ అంటూ అనేక మంది ప్రకటనలు చేస్తున్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కొందరు, కాబోయే సీఎం లోకేష్ అంటూ మరి కొందరు మంత్రులు సైతం మాట్లాడుతున్న నేపథ్యంలో లోకేష్ వారసత్వంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ “కేవలం వారసత్వంతోనే ఎవరూ రాణించలేరు” అని వ్యాఖ్యానించారు.
ప్రజాసేవ పట్ల...
లోకేష్‌కు తమ కుటుంబ వ్యాపారం వారసత్వంగా అందుబాటులో ఉన్నప్పటికీ, రాజకీయాలను ఆయన ప్రజా సేవ పట్ల ఆసక్తితో ఎంచుకున్నారని, వారసత్వం మాత్రమే అర్హత కాదన్న చంద్రబాబు ముఖ్యమంత్రి వ్యాపారం చేయడం లోకేష్‌కు చాలా సులువు. కానీ ప్రజల కోసం పనిచేయాలనే దృఢ నిశ్చయంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ఏ రంగమైనా విజయాన్ని సాధించాలంటే కేవలం వారసత్వం మీద ఆధారపడటం కష్టం. అవకాశాలను అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యంమని చంద్రబాబు అన్నారు. రాజకీయ రంగంలో గౌరవప్రదంగా నిలవాలంటే, కుటుంబ అవసరాల కోసం రాజకీయాలపై ఆధారపడకూడదనే ధృఢనిశ్చయంతోనే తమ కుటుంబం 35 ఏళ్ల క్రితం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిందని చంద్రబాబు వివరించారు.
ఈ టర్మ్ లో మాత్రం...
లోకేష్ కు ఈ టర్మ్ లో ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయనన్నట్లేనన్న విషయం చంద్రబాబు పరోక్షంగా చెప్పినట్లయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. లోకేష్ రాజకీయంగా మరింత రాటు దేలిన తర్వాత మాత్రమే అవకాశాలు దక్కుతాయని ఆయన చెప్పినట్లు అర్థమవుతుందని అంటున్నారు. 2029 ఎన్నికల్లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే టీడీపీ నేతల కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో లోకేష్ కూడా హుందాగా వ్యవహరిస్తూ తాను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించిన పనిలో బిజీగా ఉన్నానని, ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన సమయం లేదని చెప్పి తన మనసులో ఉన్న మాటను కూడా లోకేష్ చెప్పినట్లయింది.


Tags:    

Similar News