డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి రూ.1261 కోట్లు జమ చేసి సీఎం జగన్
అధికారంలోకి వచ్చిన తర్వాత సున్నా వడ్డీ కింద 2020 ఏప్రిల్ లో రూ.1,258 కోట్లు, 2021 ఏప్రిల్ లో రూ.1,100 కోట్లు, తాజాగా..
ఒంగోలు : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఒంగోలులో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఒక్క బటన్ నొక్కి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి రూ.1261 కోట్లు జమ చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. 9.76 లక్షల అర్హతగల స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 1,02,16,410 మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో.. మూడు విడతలుగా వైఎస్సార్ సున్నీ వడ్డీ పథకం కింద ఇప్పటి వరకూ రూ. 3,615 కోట్లు అందించామన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత సున్నా వడ్డీ కింద 2020 ఏప్రిల్ లో రూ.1,258 కోట్లు, 2021 ఏప్రిల్ లో రూ.1,100 కోట్లు, తాజాగా రూ.1,261 కోట్లు జమ చేశామని సీఎం వివరించారు. గతంలో డ్వాక్రా మహిళలు 12.5 నుంచి 13.5 శాతం వరకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ.. వైసీపీ వచ్చాక బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీలను 8.5-9.5 శాతానికి తగ్గించామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 2014-19 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి, అక్షరాలా రూ.14,205 కోట్ల మేర చెల్లించకుండా మోసం చేసిందని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం చేసిన మోసంతో.. ఎ-గ్రేడ్, బి-గ్రేడ్ లుగా ఉన్న పొదుపు సంఘాలన్నీ.. సి-గ్రేడ్, డి-గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయని విచారం వ్యక్తం చేశారు.