నిధులు విడుదల.. 52.3 లక్షల మందికి లబ్ధి
ఇక్కడ కులాల మధ్య గొడవలు జరగట్లేదన్న జగన్.. పెత్తందారులకు - పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా..;
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేశారు. కర్నూల్ జిల్లా పత్తికొండలో పర్యటిస్తోన్న జగన్.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. నాలుగేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు. ఇక్కడ కులాల మధ్య గొడవలు జరగట్లేదన్న జగన్.. పెత్తందారులకు - పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పేదలను, రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం రాష్ట్రంలో కరువు ఉంటుందని, వర్షాలు పడక, పంటలు పండక నానా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. మహానాడు పెద్ద డ్రామా అన్నారు.
అనంతరం వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. ఈ ఏడాది తొలివిడత వైఎస్సార్ రైతు భరోసా కింద 52 లక్షల 30 వేల 939 మంది రైతుల ఖాతాల్లో రూ.5,500 చొప్పున జమ చేశారు. మిగిలిన పీఎం కిసాన్ రూ.2000 ను నిధులు విడుదలైన వెంటనే అందిస్తామన్నారు. అలాగే అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన 47,999 మంది రైతుల ఖాతాల్లోకి రూ.44 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని జమ చేశారు. ఈ నాలుగేళ్ల కాలంలో రైతులందరికీ రూ.30,985 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.