రాబోయే ఎన్నికల్లో యుద్ధమే.!
టీడీపీ చీఫ్ చంద్రబాబుని మరోసారి టార్గెట్ చేశారు సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు మరోసారి మోసపూరిత మేనిఫెస్టోతో వచ్చాడన్నారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబుని మరోసారి టార్గెట్ చేశారు సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు మరోసారి మోసపూరిత మేనిఫెస్టోతో వచ్చాడన్నారు. చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయత ఏ మాత్రం లేవన్నారు. సత్యం పలకరని, ధర్మానికి కట్టుబడరని, మాట మీద నిలబడరని అన్నారు. చంద్రబాబును చూస్తే.. మారీచుడు, రావణుడే గుర్తుకొస్తాడన్నారు. తానే చంపేసిన మనిషికి మళ్లీ తానే పూల దండలు వేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోండి అన్న వ్యక్తి చంద్రబాబు అని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతులను చంద్రబాబు ముంచేశారని అన్నారు.
రాజమండ్రిలో డ్రామా కంపెనీ మాదిరి ఓ షో జరిగిందని, దాని పేరే మహానాడు అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదని, కర్ణాటకలో పుట్టిందన్నారు. కర్ణాటక రెండు పార్టీల మేనిఫెస్టోలోని పథకాలను కాపీ చేసి ఏపీకి మేనిఫెస్టో తీసుకొచ్చాన్నారు. మన పథకాలను కాపీ కొట్టేసి చంద్రబాబు పులహోర కలిపేశారని సెటైర్ వేశారు. కనీసం బాబుకు మేనిఫెస్టో ఎలా తయారవుతుందో తెలుసా? అంటూ ప్రశ్నించారు. తన పాదయాత్రలో ప్రజల కష్టాల నడుమ మేనిఫెస్టో పుట్టిందని, పేదవాడి గుండె చప్పుడు నుంచి మన మేనిఫెస్టో పుట్టిందని, మన మట్టి నుంచి మన మేనిఫెస్టో పుట్టిందని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తుకొస్తాయన్నారు. చంద్రబాబు త హయాంలో కర్నూలుకు రూ.10 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు.
కరువు సీమగా పేరు ఉన్న రాయలసీమ ఇప్పుడు కళకళలాడుతోందని, రిజర్వాయర్లు కూడా నిండుగా కనిపిస్తున్నాయని అన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు హయాంలో ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా? అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ పాలనకు, మీ బిడ్డ పాలనకూ మధ్య తేడా చూడాలన్నారు. చంద్రబాబు హయాంలో ఈ - క్రాప్, సోషల్ ఆడిట్ కూడా లేదన్నారు. మంచి చేయడమనేది చంద్రబాబు డీక్షనరీలోనే లేదని, ఎవరికైనా మంచి చేశానని చెప్పుకోలేని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరుగుతుందన్నారు. చంద్రబాబు డీపీటీ కావలా.. మన డీబీటీ కావాలా? అంటూ సీఎం జగన్ ప్రజలను ప్రశ్నించారు.