Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో కలెక్టర్ల సదస్సు
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కలెక్టర్ల సదస్సు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో జరగనుంది
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కలెక్టర్ల సదస్సు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు సమావేశమవుతారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా జిల్లాలో పరిస్థితులపై చంద్రబాబుకు కలెక్టర్లు వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఆరు నెలలు కావస్తుండటంతో ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాల పై చంద్రబాబు కలెక్టర్లకు వివరించనున్నారు.
రాబోయే నాలుగున్నరేళ్లు...
వారికి దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే నాలుగున్నరేళ్ల కాలంలో భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి అందించేందుకు కలెక్టర్లు కృషి చేయాలని కోరనున్నారు. ఈరోజు ఆర్టీజీఎస్, వినతుల పరిష్కారం, గ్రామ వార్డు సచివాలయాలు, ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగేందుకు అవసరమైన చర్యలపై చర్చంచనున్నారు. ప్రతి అంశంపై కూడా చంద్రబాబు లోతుగా చర్చించి కలెక్టర్లకు సూచనలు చేయనున్నారు. ఈ సమావేశం రెండు రోజుల పాటు జరగనుంది. ఇక రేపు కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశం జరుగుతుంది. ఎస్పీ లతో కూడా రేపు చంద్రబాబు సమావేశం అవుతారు.