Andhra Pradesh : వచ్చే నెల రెండో వారంలో కలెక్టర్ల సదస్సు
ఫిబ్రవరి రెండోవారంలో ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల సదస్సు జరగనుంది.;

ఫిబ్రవరి రెండోవారంలో ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల సదస్సు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సదస్సులు జరిగాయి. వీటిల్లో కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తాము నేతృత్వం వహించే శాఖల కార్యకలాపాల గురించి మాట్లాడారు. దీనివల్ల కలెక్టర్లు అభిప్రాయాలు తెలియజేసేందుకు సమయం సరిపోలేదు.
సదస్సు నిర్వహణకు
ఈ సారి ముప్ఫయి ఆరు శాఖల అధికారులు జిల్లాల సమాచారంతో ముందుగానే ప్రజెంటేషన్లు తయారుచేస్తారు. వీటిని సదస్సు నిర్వహణకు కనీసం వారం ముందు జిల్లాల కలెక్టర్లకు పంపుతారు. వీటిల్లోని సమాచారం ఆధారంగా మాట్లాడేందుకు కలెక్టర్లకే ఎక్కువ సమయం ఇవ్వనున్నారు. ఈ సదస్సు జరగడానికి కొద్దిరోజుల ముందు.. ప్రభుత్వశాఖల అధిపతులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇందులో కలెక్టర్ల సదస్సులో ఏయే అంశాలపై చర్చ జరగాలన్న దానిపై సమీక్షిస్తారు. కలెక్టర్ల పనితీరు ఆధారంగా ర్యాంకింగులూ ఇవ్వనున్నారని చెబుతున్నారు. ఈసారి కూడా రెండు రోజుల పాటు సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు.