Ys Jagan : జగన్ ఆలోచన కరెక్టేనా? మళ్లీ అందరూ చేరువవుతారా?

జగన్ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. అన్ని రకాలుగా వైసీపీ ఇబ్బందులు పడుతుంది. తిరుమల లడ్డూ వ్యవహారం చేతికి అందింది

Update: 2024-09-26 07:14 GMT

ys jagan 

వైసీపీ అధినేత జగన్ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. అన్ని రకాలుగా వైసీపీ ఇబ్బందులు పడుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత కీలక నేతలు పార్టీని వదిలి పెట్టి వెళ్లిపోతుండటం ఒక వైపు జరుగుతుండగా, మరొక వైపు ముఖ్య నేతలపై కేసులు నమోదవుతున్నాయి. ఇంకొక వైపు తిరుమల లడ్డూ వ్యవహారం మెడకు చుట్టుకుంది. లడ్డూ కల్తీ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం పరువు పూర్తిగా పోయింది. నాటి జగన్ ప్రభుత్వంలో తిరుమలలో అనుసరించిన విధానాలను గుర్తు చేసుకుంటూ జనాలు కూడా నాడు తప్పు జరిగి ఉండవచ్చన్న భావనకు వచ్చారు. వైసీపీ నేతల్లో కొద్ది మంది మినహా మరెవ్వరూ స్పందించడం లేదు. జగన్ రేపు తిరుమలకు వెళుతున్నారు. కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. 28వ తేదీన స్వామి వారిని దర్శించకుంటారు. అయితే జగన్ ను డిక్లరేషన్ తో అడ్డుకుంటే అది సానుభూతి వస్తుందని భావిస్తున్నారు.

వ్యూహం అదేనటగా...?
అయితే ఇది జగన్ స్ట్రాటజీ అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకోకుండా తిరిగి వస్తే అది పార్టీకి లాభమేనని వైసీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. వైసీపీ నేతలు కూడా జగన్ వెంట వెళుతున్నారని తెలిసింి. ఎందుకంటే జగన్ కు రాను రాను ప్రజల్లో సింపతీ పెరుగుతుందన్న భావన వైసీపీ నేతల్లో ఉంది. ప్రభుత్వం ఏదో ఒక బురద చల్లుతూ జగన్ పై ముప్పేట దాడి చేస్తూ ఒంటరి వాడిని చేసి ఇబ్బంది పాలు చేస్తుందన్న భావన ఇప్పుడిప్పుడే ప్రజల్లో కలుగుతుందంటున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు, అటు పవన్ కల్యాణ్ తో పాటు బీజేపీ నేతలు కూడా జగన్ ను టార్గెట్ చేయడంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా జగన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండటంతో కొన్ని వర్గాలు తిరిగి జగన్ కు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.
రెడ్డి సామాజికవర్గం...
ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం గత ఎన్నికల్లో జగన్ కు దూరమయింది. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గం మహిళలు కూడా గత ఎన్నికల్లో జగన్ కు ఓటెయ్యలేదు. తమకు జగన్ వల్ల ఒరిగిందేమీ లేదని, జగన్ పాలనలో తాము ఆర్థికంగా నష్టపోయామని బహిరంగంగానే వారు చెప్పారు. అయితే ఇప్పుడిప్పుడే వారి మనసుల్లో మార్పు వస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ ను ఏకాకిని చేసి అందరూ కలసి రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నది క్రమంగా ప్రబలుతోందంటున్నారు. గత ఎన్నికల్లో దూరమయిన రెడ్డి సామాజికవర్గం నుంచి జగన్ కు ఈ ఇష్యూతో సానుభూతి పెరుగుతుందన్న లెక్కలను వైసీపీ నేతలు వేసుకుంటున్నారు. కొందరు వైసీపీ నేతలతో మాట్లాడగా వారు ఈ విషయం తెలిపారు.
దళిత, మైనారిటీల్లోనూ...
ఇక దళితులు, మైనారిటీల్లో అత్యధిక శాతం మందిలో కూడా జగన్ పట్ల కొంత సింపతీ పెరిగిందంటున్నారు. తాము తప్పు చేయలేదని చెబుతున్నప్పటికీ పదే పదే చేశారంటూ అందరూ ఒక్కటై జగన్ తో పాటు ఆయన పార్టీని టార్గెట్ చేయడం పట్ల ఒకింత అసహనం ఆవర్గాల్లో బయలుదేరింది. ఇప్పటికే సంక్షేమ పధకాలు అమలు ఆలస్యమవుతుండటంతో కొంత అసంతృప్తిగా ఉన్న ఈ వర్గం ప్రజలు అంటే దళితులు, మైనారిటీలు మరింతగా ఈ లడ్డూ వివాదంతో జగన్ కు మరింత చేరువవుతున్నారంటున్నారు. వైసీీపీ ముఖ్య నేత ఒకరు ఈ విషయంపై మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లడ్డూ వివాదాన్ని ఎంత సాగదిస్తే తమకు అంత మంచిదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. హిందువులలోని కొన్ని వర్గాల్లో కూడా లడ్డూ వివాదంలో కొంత అతి చేస్తున్నారన్న అభిప్రాయం ఇప్పుడిప్పుడే వ్యక్తమవుతుందని, అది తమకు అనుకూలంగా మారుతుందని జగన్ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఈ లెక్కలు కరెక్టేనా? కాదా? అన్నది తెలియాలటే కొద్ది కాలం వెయిట్ చేయాల్సిందే.


Tags:    

Similar News