Cyclone : దూసుకు వస్తున్న తుపాన్... ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది

Update: 2023-12-02 03:00 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ఆదివారం తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కంట్రోల్ రూమ్‌‌లను కూడా ఏర్పాటు చేశారు. ఈ నెల 5వ తేదీన నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏపీ అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఎల్లో అలర్ట్...
కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే అధికారులు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరుకు 860 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమయినట్లు అధికారులు వెల్లడించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.
చేపల వేటకు వెళ్లొద్దు...
సముద్రంలోకి చేపల వేటపై నిషేధం విధించారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ తుపాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి లలో భారీ వర్షాలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. కోస్తాంధ్ర జిల్లా కలెక్టర్లు ఇప్పటికే సిబ్బందితో సమావేశమై పరిస్థితిపై చర్చించారు. మొత్తం తొమ్మిది నౌకాశ్రయాలలో1వ నెంబరు హెచ్చరిక జారీ అయింది. తుపాను కారణంగా వంద కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News