Fengal Cyclone Effect : తుపాను తీరం దాటినా బీభత్సం ఆగలేదుగా?

ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను తీరం దాటినా దాని ప్రభావం నుంచి మాత్రం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బయటపడలేదు

Update: 2024-12-02 03:39 GMT

ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినా దాని ప్రభావం నుంచి మాత్రం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బయటపడలేదు. భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రానికి తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీన పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో మరో రెండు రోజుల పాటు ఏపీ, తమిళనాడుల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. ఆ మేరకు వర్షాలు రెండు రాష్ట్రాల్లో దంచికొడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో అధికారులు విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా ఎవరూ విద్యాసంస్థలు తెరవద్దని ఆదేశాలు జారీ చేశారు. పుదుచ్చేరిలో సహాయక చర్యల కోసం భారత సైన్యం రంగంలోకి దిగింది. అనేక కాలనీలు నీటమునిగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

నాలుగు జిల్లాల్లోనూ...
ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని కూడా అధికారులు తెలిపారు. దీంతో నాలుగు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఫెంగల్ తుపాను ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని తెలియడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే కొన్ని నదులు నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని చెబుతున్నారు.
కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో...
ఏపీలోని కోస్తాంధ్రలో ఇప్పటికే తీర ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అలెర్ట్ చేశారు. మత్స్యకారులను నేడు కూడా చేపలవేటకు వెళ్లవద్దని సూచించారు. తిరుపతి జిల్లా పుత్తూరులో అత్యధికంగా 18.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు. ఫెంగల్ తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో రైతులు తమ పంటను దాచిపెట్టుకోవడానికి తంటాలుపడుతున్నారు. ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయినా అనేక చోట్ల ధాన్యం తడవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమిళనాడులో భారీ వర్షం కురుస్తుంది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. చెన్నైకి వెళ్లే పలు బస్సు సర్వీసులు కూడా రద్దయ్యాయి. భారీ వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యాన్ని నిలిపివేశారు. మరో రోజు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పుదుచ్చేరిలో అత్యధికంగా 47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.



Tags:    

Similar News