Anakapalli : అనకాపల్లి కూటమిలోనూ విభేదాలు.. ఎందుకిలా?
అనకాపల్లిలో జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలు రచ్చ కెక్కాయి
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి పార్టీ నేతల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. అనేక నియోజకవర్గాల్లో ఒక పార్టీకి, మరొక పార్టీకి మధ్య పొంతన కుదరడం లేదు. ఎన్నికలకు ముందు కలసి పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఎన్నికల అనంతరం గెలిచిన నియోజకవర్గాల్లో ఆ పార్టీలు ఆధిపత్యం కోసం అల్లాడి పోతున్నాయి. ప్రభుత్వం తమదేనన్న ధీమాతో ఎవరికి వారే ఆధిక్యతను ప్రదర్శించాలనుకోవడం ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు. అందుకు అనేక నియోజకవర్గాలు ఉదాహరణలుగా నిలిచాయి. తాజాగా అనకాపల్లి నియోజకవర్గం కూడా అందులోకి వచ్చి చేరిందనే చెప్పాలి.
రెండు పార్టీల మధ్య...
అనకాపల్లిలో జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలు రచ్చ కెక్కాయి. ఎన్నికలకు ముందు సీనియర్ నేతలందరూ కలసి పని చేసినా ఇప్పుడు మాత్రం విమర్శలు చేసుకోవడం ఒకింత రాజకీయంగా ఇబ్బందిగా మారింది. గత ఎన్నికల్లో అనకాపల్లిలో కూటమిలో పొత్తులో భాగంగా జనసేనకు ఆ స్థానాన్ని కేటాయించారు. అక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నేత కొణతాల రామకృష్ణ విజయం సాధించారు. కొణతాల రామకృష్ణకు సౌమ్ముడిగా పేరుంది. ఆయన వివాదాలకు దూరంగా ఉంటారంటారు. అలాంటి చోట విభేదాలు ఇప్పుడు పార్టీ అధినాయకత్వాలను ఇబ్బంది పెట్టేవిధంగా తయారయ్యాయి.
కొణతాల వర్సెస్ దాడి....
అనకాపల్లిలో టీడీపీ నేత దాడి వీరభద్రరావు, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మధ్య విభేదాలు బయటపడ్డాయి. కొణతాల రామకృష్ణ లక్ష్యంగా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో దాడి వీరభద్రరావు చేసిన విమర్శలు దీనికి అద్దం పడుతున్నాయి. ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే పరిపాలన చేయకుండా, ఎమ్మెల్యే పక్కకు తప్పుకొని అల్లుడికి బాధ్యతలు అప్పగించారని దాడి ఆరోపించారు. అత్తవారింటికి వచ్చిన అల్లుడు ఇక్కడ పెత్తనం చేయడమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అల్లుడికి పోలీసులు సెల్యూట్ చేస్తున్నారని, అనకాపల్లిలో వేర్ ఇస్ డెమోక్రసీ అని దాడి నిలదీశారు. అనకాపల్లిలో జనసేన ప్రభుత్వం నడుస్తుందని దాడి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు తెలుగుదేశం పార్టీకి సహకరించడం లేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని అధికారులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు జోక్యం చేసుకోకుంటే ఈ రచ్చ మరింత పెద్దదయ్యే అవకాశాలున్నాయి.