Pawan Kalyan : పవన్ ను హర్ట్ చేయొద్దు సామీ.. అదే జరిగితే తట్టుకోలేరు గురూ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి అందరికీ తెలిసిందే. ఏ నిర్ణయమైనా వెంటనే తీసుకుంటారు;

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి అందరికీ తెలిసిందే. ఏ నిర్ణయమైనా వెంటనే తీసుకుంటారు. వెనకాముందు ఆలోచించరు. తాను హర్ట్ అయితే మాత్రం వెనువెంటనే నిర్ణయం తీసుకుంటారు. జగన్ ప్రభుత్వంపై గతంలో పవన్ కల్యాణ్ చేసినట్లుగా విమర్శలు ఎవరూ చేయలేదు. జగన్ పై ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ కు ఆగ్రహం లేకపోయినా.. జగన్ తో పాటు ఆయన పార్టీ నేతలు తనపై చేసిన కామెంట్స్ తో పవన్ బాగా హర్ట్ అయ్యారు. మూడు పెళ్లిళ్లంటూ జగన్ ప్రతి బహిరంగసభలో ప్రస్తావించడాన్ని తట్టుకోలేకపోయారు. అందుకే తనకు ఇష్టం లేకపోయినా టీడీపీతో చేతులు కలిపారు. బీజేపీని కూటమిని దగ్గరకు చేర్చారు. జగన్ ను ఓడించగలిగారు. ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలను తీసుకున్నారు.
కెమెస్ట్రీ బాగా కుదిరిన సమయంలో...
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరూ సయోధ్యతతో కొనసాగుతున్నారు. కానీ గత కొద్ది రోజులుగా నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి అని ప్రస్తావించడం మాత్రం జనసేన నేతల్లో ఆగ్రహం తెప్పిస్తుంది. జనసేన మాత్రమే కాదు.. కాపు సామాజికవర్గంలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ కు, లోకేష్ కు మధ్య పోటీ ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నారా లోకేష్ పార్టీకి ఎంతో సేవ చేశారు. అందులో ఎవరూ కాదనలేరు. కానీ ఇప్పుడు పదవుల్లో ప్రమోషన్ పొందేందుకు సమయం కాదన్నది సీనియర్ నేతలు సయితం అంగీకరిస్తున్నారు.
పార్టీకి సేవ చేసినా...
నారా లోకేష్ గత ఎన్నికలకు ముందు వేలాది కిలోమీటర్ల యువగళం పేరుతో పాదయాత్ర చేసిన మాట నిజమే. కానీ అదే సమయంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ అందించిన స్నేహస్తాన్ని మర్చిపోకూడదని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తో సరిసమామైన పదవిని కోరుకోవడం సబబు కాదని జనసేన నేతలు సోషల్ మీడియాలో నేరుగా పోస్టింగ్ లు పెడుతున్నారు. అలాగయితే తమ అధినేత పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పదవి అనేది నారా లోకేష్ నుంచి వచ్చిన ప్రతిపాదన కాదు. కేవలం నాయకుల అభిప్రాయాలు మాత్రమే. అయినా సరే.. ఒక నిర్ణయం తీసుకునే ముందు జననాడి తెలుసుకునేందుకు రాజకీయ నేతలు ఇలాంటి ట్రిక్స్ వేస్తుంటారని జనసేన నేతలు అంటున్నారు. అదే జరిగితే తాము ఈసారి టీడీపీకి ఓటు వేసేది లేదని చెబుతున్నారు.
అగ్రనేతలు స్పందించకున్నా...
మరోవైపు పవన్ కల్యాణ్ కూడా దీనిపై ఎక్కడా స్పందించలేదు. చంద్రబాబు, లోకేష్ కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదు. కానీ సీనియర్ నేతల నుంచి మంత్రులు వరకూ ఈ రాగం అందుకోవడంతో జనసేన వర్గాల్లో చికాకు ఎక్కువగా కనపడుతుంది. తమ నేతకు చిర్రెత్తుకొస్తే.. కటీఫ్ చేప్పేయడం చిటెకలో పని అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. సజావుగా పాలన సాగుతున్న సమయంలో, మరో పదేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగానే చంద్రబాబు ఉండాలని పవన్ కల్యాణ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన తర్వాత కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ కు పసుపు పార్టీ నేతలు దిగడం మంచిదికాదన్న హెచ్చరికలు జనసేన నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చినప్పుడు అందరూ పదోన్నతులు అడుగుతారని, అదే ఓటమి పాలయితే మాత్రం అస్సలు పట్టించుకోరన్న వ్యాఖ్యలు కూడా కనిపిస్తున్నాయి.