ఏపీని చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం ఇప్పటికే 34 వేల ఎకరాలు తీసుకున్నారని, పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2,700 ఎకరాలు మాత్రమేనని వడ్డే అన్నారు. ఇప్పుడు అదనంగా మరో 44 వేల ఎకరాలు తీసుకుంటామంటున్నారని, రియల్ ఎస్టేట్ కోసం 44 వేల ఎకరాలు తీసుకుంటున్నారా బాబూ? అంటూ మాజీమంత్రి వడ్డేశోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు.
రాజధాని కోసం...
ఇప్పటికే రాజధాని కోసం రూ.31 వేల కోట్లు అప్పు చేశారని, ఇంకా రూ.69 వేల కోట్లు అవసరమంటున్నారని, అసలు చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ఆయన నిలదీశారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా బాబు పట్టించుకోవడం లేదన్న వడ్డే ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదని, మంచి పరిపాలన అని ఆయన అన్నారు. ప్రజలకు మేలు చేయకుండా మెట్రో రైలు జపం చేయడమెందుకు? అని ప్రశ్నించారు. ఏపీలో ఉన్న ఆరు అయిర్ పోర్టులు సరిపోవా? మళ్లీ కొత్తవి దేనికంటూ ఆయన నిలదీశారు. ఇప్పటికైనా చంద్రబాబు ఆలోచనల్లో మార్పు రావాలని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు.