పెరిగిన వరద .. హైదరాబాద్-విజయవాడ హైవేపై రాకపోకలు బంద్
ఎగువప్రాంతం నుంచి కట్టలేరుకు వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కీసర వంతెన - నందిగామ మండలంలోని..
కృష్ణాజిల్లా కీసర టోల్ గేట్ సమీపంలోని ఐతవరం గ్రామం వద్ద మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. వాగుకు వరదతాకిడి పెరగడంతో.. హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. దాంతో గురువారం సాయంత్రం నుంచి పోలీసులు హైవేపై రాకపోకలను నిలిపివేశారు. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో.. కీసర టోల్ గేట్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు సుమారు 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. వెనక్కు వెళ్లలేక.. ముందుకెళ్లే దారిలేక పలువురు వాహనదారులు నిన్నసాయంత్రం నుంచి పడిగాపులు పడుతున్నారు.
ఎగువప్రాంతం నుంచి కట్టలేరుకు వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కీసర వంతెన - నందిగామ మండలంలోని ఐతవరం గ్రామాల మధ్య ఉన్న జాతీయ రహదారిపై రెండు అడుగుల ఎత్తున మున్నేరు పొంగుతోంది. కంచికచర్ల- నందిగామ మధ్య, విజయవాడ, హైదరాబాద్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను మరోమార్గంలో దారి మళ్లించారు. మున్నేరు శాంతించేంతవరకూ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లోనే వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు పెనుగంచిప్రోలు మండలం వెంగనాయకపాలెంలో ఓ పశువుల కాపరి మున్నేరులో చిక్కుకున్నాడు. నిన్నటి నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్న అతడిని కాపాడేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది.