Andhra Pradesh : సంక్రాంతికి ఫ్రీబస్సు లేదట? అయితే మరొక గుడ్ న్యూస్ తో చంద్రబాబు రెడీ అవుతున్నారా?
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సంక్రాంతికి కల్పించాలని భావించినా అది వాయిదా పడింది
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సంక్రాంతికి కల్పించాలని భావించినా అది వాయిదా పడింది. అదే సమయంలో సంక్రాంతికి మరో రూపంలో గుడ్ న్యూస్ చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలిసింది. ఉచిత బస్సు స్థానంలో మరొక హామీని అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఇది ఉచిత బస్సుతో పోలిస్తే కొంత మెరుగైనదేనన్న భావనలో ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందించాలని ప్రభుత్వం తొలుత భావించింది. ఇందుకోసం ఇప్పటికే మంత్రులతో కమిటీని కూడా నియమించింది. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ముగ్గురు మంత్రులను ఆదేశించారు.
ఉగాది నుంచి...
అయితే సంక్రాంతి నాటికి ఈ నివేదిక ఇవ్వడం సాధ్యకాకపోవచ్చని అధికారులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పడంతో ఉగాది నుంచి అంటే మార్చి నెలలో ఫ్రీ బస్సు ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలో 11000 వేల మంది అదనపు సిబ్బందిని నియమించడంతో పాటు రెండు వేల ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయాల్సి రావడం వంటి కారణాలు కూడా ఫ్రీ బస్సు హామీని మరో మూడు నెలలు వెనక్కు నెట్టినట్లు తెలిసింది. ఉగాదినాటికి మాత్రం ఖచ్చితంగా మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
సంక్రాంతి అంటేనే...
ఇక సంక్రాంతి అంటే ఏపీ ప్రజలకు పెద్ద పండగ. రైతుల పండగ. అందుకోసం రైతులకు సంబందించిన హామీని అమలు చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని తెలిసింది. రైతు కు ఏడాదికి పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలలో ప్రకటించారు. అందులో తొలి విడతగా ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేందుకు నివేదికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. కానీ ఈ పథకానికి మొన్నటి బడ్జెట్ లో నిధుల కేటాయింపు జరగలేదు. అయినా సంక్రాంతికి సూపర్ సిక్స్ హామీని అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో రైతుల కోసం ఇచ్చిన హామీని అమలు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని అంటున్నారు. అయితే ఇంత తక్కువ సమయంలో నిధుల సమీకరణ సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జనవరి మొదటి వారంలో దీనిపై క్లారిటీ రానుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now