TDP : పాపం గంటా.. ఇక ఆశలు వదులుకోవాల్సిందేనా?
గంటాశ్రీనివాసరావు సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన పార్టీలు మారినా అధికారంలో ఉన్న పార్టీలో చేరి మంత్రి అయ్యారు;

గంటాశ్రీనివాసరావు సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన పార్టీలు మారినా అధికారంలో ఉన్న పార్టీలో చేరి మంత్రి అయ్యారు. ఆయనకు ఉన్న అంగబలం, అర్థబలం మంత్రిపదవిని తెచ్చిపెట్టాయి. తొలుత తెలుగుదేశం పార్టీలో చేరి 2004లో చోడవరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి నుంచిపోటీ చేసి గెలుపొందారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత కాంగ్రెస్ హయాంలో మంత్రి పదవిని చేపట్టారు. 1999లో అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019 లో టీడీపీ నుంచి విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు విశాఖకు వచ్చి స్థరపడి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. తర్వాత రాజకీయ నాయకుడిగా మారారు.
నియోజకవర్గాలు మారుతూ...
ప్రతి సారీ నియోజకవర్గాలు మారటం ఆయనకు హాబీ. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మరోసారి పోటీ చేయరు. అలా తన రాజకీయాలను నెట్టుకొస్తున్న గంటా శ్రీనివాసరావుకు ఈసారి మాత్రం చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కలేదు. తనకంటే పార్టీలో జూనియర్ అయిన వంగలపూడి అనితకు హోంమంత్రిగా నియమించడం, అదే జిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవి రావడంతో గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కలేదు. అదే సమయంలో గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు నారాయణకు మంత్రి పదవి దక్కడంతో పాటు జనసేన నుంచి కాపులు, టీడీపీ నుంచి కాపులు ఎక్కువగా ఉండటంతో సామాజికవర్గం కూడా గంటా శ్రీనివాసరావును దెబ్బతీసిందనే చెప్పాలి.
అధినాయకత్వానికి కూడా...
అయితే గంటా శ్రీనివాసరావుపై అధినాయకత్వానికి గతంలో ఉన్న సదభిప్రాయం మాత్రం లేదనే చెప్పాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో పెద్దగా యాక్టివ్ గా లేకపోవడంతో పాటు కనీసం ఆయన కూర్చున్న చోటు నుంచి లేచి అప్పటి అధికారపక్షాన్ని ఎదిరించలేదన్న విమర్శలున్నాయి. అదే సమయంలో చంద్రబాబుపైనా, ఆయన కుటుంబసభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా గంటా శ్రీనివాసరావు పట్టీపట్టనట్లు వ్యవహరించారన్నది ప్రధాన ఆరోపణ. అందుకే ఈసారి మంత్రివర్గంలో దూరం పెట్టారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక ఐదేళ్ల పాటు గంటా శ్రీనివాసరావు సాధారణ ఎమ్మెల్యేగానే చూడాల్సి ఉంటుంది.
అందుకే ఫ్రస్టేషన్...
అందుకే ఆయనలో ఫ్రస్టేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. తరచూ ఉద్యోగులపై దూషణలకు దిగడంతో పాటు తరచూ సహనం కోల్పోతున్నారు. అధికారంలోకి వచ్చినా తనకు మంత్రి పదవి రాలేదన్న అక్కసు ఆయనలో అడుగడుగునా కనిపిస్తుంది. ఇక ఐదేళ్ల పాటు కాపు సామాజికవర్గం కోటాలో గంటా శ్రీనివాసరావుకు మాత్రం మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేదు. నారాయణ చంద్రబాబు మంత్రి వర్గంలో పూర్తికాలం మంత్రిగా కొనసాగుతారు. అలాగే జనసేన నుంచి ఇద్దరు ముగ్గురు కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులుంటారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావుకు కనుచూపు మేరలో మంత్రి పదవి దొరకడం అసాధ్యమని తెలిసి కొంత ఫ్రస్టేషన్ కు గురవుతున్నట్లు కనిపిస్తుంది.