ఏపీ మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్

పిల్లలను దత్తత తీసుకునే వారికి, ఇద్దరు లోపు పిల్లలున్న వారికే ఈ సెలవులు వర్తిస్తాయి. పిల్లలను దత్తత తీసుకున్నవారు మాత్రం..

Update: 2022-03-09 05:11 GMT

అమరావతి : ఏపీ మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పిల్లల సంరక్షణ కోసం ఇప్పటి వరకూ 60 రోజులుగా ఉన్న సెలవులను 180 రోజులకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గతరాత్రి ఉత్తర్వులు విడుదల చేశారు. 11వ వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. పిల్లలను దత్తత తీసుకునే వారికి, ఇద్దరు లోపు పిల్లలున్న వారికే ఈ సెలవులు వర్తిస్తాయి. పిల్లలను దత్తత తీసుకున్నవారు మాత్రం ఆరునెలలోపు మాత్రమే ఈ సెలవులను వినియోగించుకోవాల్సి ఉంటుంది. దత్తత తీసుకునే పిల్లల వయసు నెల రోజులలోపు ఉంటే ఈ సెలవులు ఏడాదిపాటు కూడా తీసుకోవచ్చు. సెలవు రోజుల్లోనూ వేతన చెల్లింపులు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అలాగే.. ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేసే నర్సింగు సిబ్బందికి, ఎముకలు, అవయవాల పరంగా ఇబ్బందులు ఉన్న ఉద్యోగులు, ఉద్యోగినులకు ప్రత్యేక సాధారణ సెలవు ఏడాదికి ఏడు రోజులపాటు వర్తింపజేయనున్నారు. కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్, క్షయ, కుష్టు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి అసాధారణ సెలవులు మంజూరు చేస్తారు. అలాగే, ఆ సమయంలో ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను కూడా పెంచి ఇస్తారు. ఎన్జీవోల్లో మూలవేతనం రూ. 35,570కు పరిమితం చేసి ఎక్స్‌గ్రేషియా కనీస మొత్తాన్ని రూ. 11,560గా, గరిష్ఠంగా రూ. 17,780గా చెల్లిస్తారు. చివరి గ్రేడు ఉద్యోగికి కనీసం రూ. 10 వేలు, గరిష్ఠంగా రూ. 15 వేలు చెల్లించనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Tags:    

Similar News