భక్తులకు శుభవార్త.. ఇకపై టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనం
బుధ, గురు, శక్రవారాలకు గాను మంగళవారం లక్ష టోకెన్లు జారీ చేయాలని అనుకున్నామన్నారు. శనివారం టోకెన్లు దొరకనివారు తిరుపతిలో..
తిరుపతి : ఏప్రిల్ 12వ తేదీ, మంగళవారం తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట నేపథ్యం టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టోకెన్లు లేకుండానే భక్తులను శ్రీవారి సర్వదర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి ప్రకటన చేశారు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 11 వరకూ టోకెన్ల విధానం సవ్యంగానే సాగిందన్న ఆయన.. 9, 10, 11 తేదీల్లో రద్దీ నేపథ్యంలో 8వ తేదీనే మూడు రోజులకు సరిపడా టికెట్లు ఇచ్చామని పేర్కొన్నారు. అందుకే కౌంటర్లను మూసివేసినట్లు తెలిపారు.
బుధ, గురు, శక్రవారాలకు గాను మంగళవారం లక్ష టోకెన్లు జారీ చేయాలని అనుకున్నామన్నారు. శనివారం టోకెన్లు దొరకనివారు తిరుపతిలోనే ఉండిపోయారని, ఆ తర్వాత నాలుగు రోజులు సెలవులు కావడంతో మరింత మంది భక్తులు వచ్చారని వివరించారు. ఈ నేపథ్యంలో టికెట్లు తీసుకుని బయటకి వచ్చే లైన్‌లోకి భక్తులు ప్రవేశించడంతో గందరగోళం తలెత్తిందన్నారు. సమస్యను అరగంటలోనే పరిష్కరించినా.. భక్తులను భగవంతుడికి దూరం చేస్తున్నామన్న ప్రచారం సరికాదన్నారు. చిన్న ఘటనను పెద్దగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.